ఆన్లైన్ ద్వారా రుణాలు ఇస్తామని మోసాలకు పాల్పడుతున్న కేసులు ఇటీవల భారీగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో పలు కేసులకు సంబంధించి దర్యాప్తు చేపట్టింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ). చైనా యాప్ ద్వారా మోసాలకు పాల్పడిన కేసుల్లో 7 ఆన్లైన్ రుణ సంస్థలకు చెందిన రూ.76.67 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. సీఐడీ వద్ద నమోదైన కేసు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఈడీ.. ఈ మేరకు భారీగా ఆస్తులు సీజ్ చేసింది.
ఏడు సంస్థల్లో మూడు ఫిన్‌టెక్(ఫైనాన్సియల్ టెక్నాలజీ)వి ఉన్నట్లు ఈడీ తెలిపింది. అవి.. మ్యాడ్ ఎలిఫాంట్ నెట్వర్క్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, బర్యోనిక్స్ టెక్నాలజీస్ పీవీటీ, క్లౌడ్ అట్లాస్ ఫ్యూచర్ టెక్నాలజీ పీవీటీలు ఉన్నాయి. వీటన్నింటిని చైనాకు చెందిన వ్యక్తులు నిర్వహిస్తున్నట్లు గుర్తించింది. మిగితావి.. ఎక్10 ఫైనాన్షియల్ సర్వీసెస్, ట్రాక్ ఫైన్డ్, జమ్నాదాస్ మెరార్జీ ఫైనాన్స్‌లు.. ఉండగా అవి బ్యాంకింగ్యేతర ఫైనాన్షియల్ సంస్థలుగా నమోదైనట్లు ఈడీ వెల్లడించింది.
రుణాలు తీసుకుని చెల్లించలేని వారిని రికవరీ ఏజెంట్లు వేధింపులకు గురిచేసినట్లు ఈడీ గుర్తించింది. రుణ గ్రహీతల ఫోన్ నంబర్లు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసి.. వేధిస్తున్నారని తెలిపింది. ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి భారత్‌లో ఈ వ్యాపారం కొనసాగిస్తున్నారని వెల్లడించింది. తక్షణ రుణాలు అందించే సంస్థలపై కేసు నమోదు చేసినట్లు తెలిపింది.
యువకుడు ఆత్మహత్య..
తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి రుణ యాప్‌ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణాలుకు పాల్పడుతున్న 7 సంస్థలతో పాటు స్థానిక భాగస్వామ్య సంస్థలపై ఈడీ చర్యలు చేపట్టింది. కార్యాలయాలను మూసివేసింది. వాటికి చెందిన నగదు, ఆస్తులను సీజ్ చేసింది.
అక్రమ నగదు బదిలీ చట్టం కింద పలువురు చైనాకు చెందిన వ్యక్తులపై తెలంగాణ పోలీసులు, సైబర్ విభాగం కేసు నమోదు చేసింది. హైదరాబాద్ పోలీసులు ఇప్పటి వరకు 27 ఎఫ్ఆర్లు నమోదు చేశారు.
ఇదీ చూడండి: దా'రుణ' యాప్ కేసులో మరోకరు అరెస్టు