మధ్యప్రదేశ్ గునా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ కొవిడ్ రోగి చనిపోగా.. అతని కుటుంబ సభ్యులు రెచ్చిపోయారు. ఆస్పత్రి సిబ్బందిపై దాడి చేయటమే కాకుండా.. ఆక్సిజన్ సరఫరా చేసే వాల్వును మూసివేయటానికి యత్నించారు. అయితే.. ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తమై వారిని అడ్డుకోగా.. పెను ప్రమాదం తప్పింది.
'ఆక్సిజన్ వాల్వును వారు మూసి ఉంటే.. ఇక్కడ చికిత్స పొందుతున్న వారిలో 22 మంది ప్రాణాలు కోల్పోయేవారు' అని ఆస్పత్రికి చెందిన ఓ అధికారి తెలిపారు.
ఇంతకీ ఏం జరిగింది.
గునా జిల్లా ఆస్పత్రిలో కొవిడ్‌తో చికిత్స పొందుతున్న ఆర్డీ శ్రీవాస్తవ(63) అనే వ్యక్తి.. శనివారం ఉదయం ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు ఆస్పత్రి తెలియజేయగా వారు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. అనంతరం.. తమపై దాడి చేశారని ఆరోగ్య సిబ్బంది తెలిపారు.
"ఇక్కడ రోగులకు సాధ్యమైనంత మేర ఉత్తమ చికిత్స అందిస్తున్నాం. దురదృష్టవశాత్తు ఈరోజు ఉదయం 5 గంటలకు ఆ రోగి చనిపోయాడు. ఈ విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు తెలియజేయగా.. ఆగ్రహానికి గురయ్యారు. ఆస్పత్రి సామగ్రిని ధ్వంసం చేశారు. వైద్యులు, సిబ్బందిపై దాడి చేశారు."
-డాక్టర్ పంకజ్, గునా జిల్లా ఆస్పత్రి వైద్యుడు
అంతకుముందు.. ఇదే తరహా ఘటన దిల్లీలో జరిగింది. ఓ మహిళా కరోనా రోగికి అపోలో ఆస్పత్రిలో పడక దొరకక మరణించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు.. ఆస్పత్రి సిబ్బందిపై దాడి చేశారు.
ఇదీ చూడండి: రాజేశ్ సహాయ్.. ఓ 'డాక్టర్' పోలీస్
ఇదీ చూడండి: అమ్మ, నాన్నను కోల్పోయినా.. సేవకే ఆమె ప్రాధాన్యం