దేశంలో కరోనా టీకా అత్యవసర వినియోగానికి సంబంధించి డీసీజీఐ ఈరోజు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. కాసేపట్లో డీసీజీఐ డైరెక్టర్ జనరల్ మీడియా ముందుకు రానున్నారు. ఈ మేరకు వైద్యశాఖ వర్గాలు ఓ ప్రకటన చేశాయి.
కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను అత్యవసర వినియోగానికి అనుమతించవచ్చని నిపుణుల కమిటీ సిఫారసు చేసిన నేపథ్యంలో ఆ దిశగా డీసీజీఐ ప్రకటన చేయొచ్చని భావిస్తున్నారు. డీసీజీఐ ప్రకటన కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
కొవాగ్జిన్ టీకాను హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న దిగ్గజ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ తయారుచేయగా.. కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఆక్స్‌ఫర్డ్- ఆస్ట్రాజెనెకాతో కలిసి పుణె కేంద్రంగా పనిచేస్తున్న సీరం సంస్థ ఉత్పత్తి చేస్తోంది. ఈనెల 1న కొవిషీల్డ్‌కు, శనివారం కొవాగ్జిన్‌ను అత్యవసర వినియోగానికి అనుమతించవచ్చని నిపుణుల బృందం సిఫారస్ చేసింది.
డీసీజీఐ నిర్ణయం తర్వాత దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
తొలి దశలో 3 కోట్ల మందికి..
దేశవ్యాప్తంగా తొలిదశలో 3 కోట్ల మందికి కరోనా టీకా ఉచితంగా వేయనున్నారు. 50ఏళ్లకుపై పడిన 27 కోట్ల మంది ప్రాధాన్య లబ్ధిదారులను ఎంపిక చేయటానికి వైద్య శాఖ కసరత్తు చేస్తోంది. కొవిడ్ టీకా కోసం కేంద్ర వైద్య శాఖ ఇప్పటికే రెండు విడతలుగా డ్రై రన్ నిర్వహించింది. కొవిడ్ టీకాను వేగంగా సరఫరా చేసేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాయి.