రాజస్థాన్ అల్వార్‌లో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. కొవిడ్‌తో గంటల వ్యవధిలో చనిపోయిన తల్లిదండ్రులకు ఇద్దరు కూతుళ్లు దహన సంస్కారాలు నిర్వహించారు. వారి సోదరుడు ఉద్యోగరీత్యా అమెరికాలో ఉండటం వల్ల అంత్యక్రియలకు హాజరుకాలేకపోయాడు. చుట్టుపక్కల ఉండే వారిని సాయం కోరినా ఎవరూ స్పందించలేదు. ఇక చేసేదేమీ లేక వారిద్దరే అమ్మానాన్నలకు కడసారి వీడ్కోలు పలికారు.
మరో ఘటన...
రాజస్థాన్ జోధ్‌పుర్‌లో తల్లి మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కుమార్తెలు ఎంతో కష్టపడ్డారు. కరోనాతో మరణించిన విషయం తెలిసి మృతదేహాన్ని శ్మశానానికి తరలించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఎంతో మంది అంబులెన్స్ డ్రైవర్లను వేడుకున్నా.. వారు జాలి చూపించలేదు. చివరకు బయట ఉండే టాక్సీ డ్రైవర్ సాయం చేసేందుకు ముందుకువచ్చాడు. స్థానిక శ్మశానవాటికకు తరలించాడు.
కడసారి చూపు వీడియో కాల్లో..
ఉత్తర్‌ప్రదేశ్ అక్బాపూర్కు చెందిన సంతోశ్.. విశ్రాంత సుబేదార్. అతని భార్య లత చాలా కాలంగా జోధ్‌పుర్ ఆస్పత్రిలో ఉండి చివరకు చనిపోయారు. ఈ సమయంలో ఆయన అక్కడ లేరు. దీంతో మృతదేహాన్ని కుమార్తెలకు అప్పగించారు. పెద్దకుమార్తె దీపిక తల్లికి దహన సంస్కారాలు చేసింది. కట్టుకున్న భార్య చివరి గడియలకు హాజరు కాలేకపోయిన సంతోశ్‌కు.. కుమార్తెలు వీడియో కాల్ ద్వారా భార్య అంత్యక్రియలను చూపించారు. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలిచి వేసింది.
ఇదీ చూడండి: తల్లి చనిపోయినా.. తండ్రి కోసం తనయుడి ఆరాటం!