కేరళను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరద నీటి ప్రవాహంతో (heavy floods in kerala) జలాశయాల్లో నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరింది. దాదాపు పది రిజర్వాయర్లకు రెడ్ అలర్ట్ జారీ చేసింది అధికార యంత్రాంగం. కక్కి నది రెండు గేట్లు తెరవగా.. పంపా నదిలో వరద ప్రవాహం అమాంతం పెరిగిపోయింది. దీంతో శబరిమల తీర్థయాత్రను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి కే రాజన్ ప్రకటించారు.
కక్కి నది గేట్లు తెరవడం వల్ల.. పంపా నదిలో 15 సెంటీమీటర్ల మేర (heavy rains in kerala) నీటిమట్టం పెరిగే అవకాశముంది. అదీకాక అక్టోబర్ 20 నుంచి 24 వరకు మళ్లీ అధికంగా వర్షసూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో శబరిమల యాత్ర నిలిపివేత తప్పట్లేదని అధికార వర్గాలు తెలిపాయి. పంపా నది సమీప ప్రాంతాల్లో నివసించేవారిని పునరావాస ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించాయి. రాష్ట్రవ్యాప్తంగా 184 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయా వర్గాలు పేర్కొన్నాయి.
రెడ్ అలర్ట్ జారీ చేసిన రిజర్వాయర్లు ప్రధానంగా పథనంతిట్ట, ఇడుక్కి, త్రిస్సూర్ జిల్లాల్లో ఉన్నాయి. రాష్ట్రంలో మరో ఎనిమిది డ్యాంలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేశారు.
27 మంది మృతి..
ఎడతెరిపి లేకుండా కురిసిన వానల కారణంగా రాష్ట్రంలో కొండచరియలు (landslides in kerala) విరిగిపడి మృత్యువాతపడ్డవారి సంఖ్య సోమవారం నాటికి 27కు పెరిగింది. వీరిలో ఒక్క కొట్టాయం జిల్లా వాసులే 14 మంది. ఇడుక్కి జిల్లాలో తొమ్మిది మంది, అలప్పుజలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రస్తుతం వర్షం తీవ్రత తగ్గడం కాస్త ఊరట కలిగించే విషయం. కొండచరియల్లో చిక్కుకుపోయిన వారికోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
కేరళలో తాజా పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో ఆదివారం ఫోన్‌లో మాట్లాడారు. కేరళకు అన్నివిధాలా అండగా ఉంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి:వరుణుడి ప్రకోపం.. కన్నీటి సంద్రమైన కేరళ