భారత, పాకిస్థాన్‌లుగా దేశం రెండుగా విడిపోయింది సరే! ఇంతకూ ఈ రెంటినీ విడగొట్టిందెవరు? ఏ భాగం ఎవరికన్నది ఎవరు నిర్ణయించారు? ఎలా నిర్ణయించారు?
ప్రపంచ చరిత్రలో.. కోట్ల మందిని నిరాశ్రయుల్ని చేసి.. వలసబాట పట్టించి.. లక్షల మంది ధనమానప్రాణాలను హరించిన అత్యంత దారుణమైన విభజన రేఖ గీసింది సర్ సైరిల్ రాడ్‌క్లిఫ్!
భారత్, పాకిస్థాన్‌ల మధ్య రెండు విభజన రేఖలను (సరిహద్దులను) గీసే బాధ్యతను రాడ్‌క్లిఫ్‌కు అప్పగించింది బ్రిటిష్ ప్రభుత్వం. రెండు దేశాలుగా, మూడు భాగాలుగా విభజన ఖాయమైంది. పశ్చిమాన భారత్-పాకిస్థాన్, తూర్పున భారత్-తూర్పు పాకిస్థాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లకు సంబంధించి... లక్షా 75వేల చదరపు మైళ్ల భూభాగాన్ని ఆయన విభజించాల్సి వచ్చింది. ప్రధానంగా ఈ విభజనంతా పంజాబ్, బంగాల్‌కు సంబంధించిందే!
రాడ్‌క్లిఫ్ వృత్తిరీత్యా లాయర్! ఆయనకు ఇద్దరు పాక్, ఇద్దరు భారత న్యాయవాదులను సహాయకులుగా అప్పగించారు.
1947 జులై 8న దిల్లీలో అడుగుపెట్టిన ఆయనకు.. పని పూర్తి చేయటానికి నెలరోజుల సమయం ఇచ్చారు. దిల్లీకి కాస్త దూరంగా సిమ్లాలో వీరిని ఉంచారు.
సరిహద్దుల నిర్ణయానంతరం... రెండువైపులా భారీస్థాయిలో ప్రజలు చనిపోయారని, మారణకాండ చెలరేగిందన్న వార్తలు విని... తనకు ప్రభుత్వం ఇచ్చిన జీతభత్యాలను కూడా తిరస్కరించారు.
విభజన తీరును అనేకమంది విమర్శించారు. ఇంత హడావుడిగా చేయాల్సింది కాదని... ఇంత అశాస్త్రీయంగా చేయాల్సింది కాదనే విమర్శలు వెలువడ్డాయి. రాడ్‌క్లిఫ్ ఇచ్చిన సమాచారం, పటాలు కూడా తప్పుల తడకలన్నారు... మొత్తానికి ఐదు వారాల్లో గీసిన గీతలు... కోట్ల మంది జీవితాలను దుర్భరంలోకి నెట్టేశాయి. ఓ మారణహోమానికి కారణమయ్యాయి.
సుమారు 2900 కిలోమీటర్ల భారీ సరిహద్దులో... ఐదు చోట్ల క్రాసింగ్ పాయింట్లు వస్తాయి.
బాగా చేయలేకపోయా: రాడ్‌క్లిఫ్
"నాకు చాలా తక్కువ సమయం ఇచ్చారు. ఐదు వారాల్లో అంత బాగా చేయలేకపోయాను. కనీసం రెండు మూడు సంవత్సరాల సమయం ఇచ్చి ఉంటే ... మరింత మెరుగ్గా ఉండేదేమో. తొలుత నేను లాహోర్‌ను భారత్‌కు కేటాయించాను. కానీ... పాకిస్థాన్‌కు పెద్ద పట్టణం అంటూ లేకుండా పోతుందనటంతో దాన్ని పాకిస్థాన్‌లో ఉంచాల్సి వచ్చింది."
- 1976లో కులదీప్ నయ్యర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాడ్‌క్లిఫ్
భారత్‌కు 80 పాక్‌కు 20
విభజన వేళ ఆస్తుల పంపకాలు విచిత్రంగా జరిగాయి. జనాభా ప్రాతిపదికన భారత్-పాకిస్థాన్ మధ్య ఆస్తుల పంపకం జరపాలని వైస్రాయి లార్డ్ మౌంట్‌బాటన్ నిర్ణయించారు. 80:20 సూత్రాన్ని ప్రతిపాదించారు. దీని ప్రకారం.. కరెన్సీ, అప్పులు విషయంలో ఇరుదేశాల మధ్య పెద్దగా సమస్యలు రాలేదు. కానీ..
సైన్యాన్నీ రెండుగా విభజించారు. 2,60,000 మంది హిందువులు, సిక్కులు, భారత్ సైన్యంలో, లక్షా 40 వేల మంది ముస్లింలు పాక్ సైన్యంలో చేరారు. గూర్ఖా దళాలను బ్రిటన్, భారత్ పంచుకున్నాయి. ఈ బదిలీ ప్రక్రియలో బ్రిటన్ సైన్యాధికారులు కీలక పాత్ర పోషించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత్ తొలి సైన్యాధిపతిగా జనరల్ రాబర్ట్ లాక్హార్ట్ నియుక్తులయ్యారు.
ఇవీ చదవండి: భద్రతా వలయంలో ఎర్రకోట- రంగంలోకి షార్ప్ షూటర్లు