పలు రాష్ట్రాలను వణికించిన గులాబ్ తుపాను(Gulab Cyclone).. తీరం దాటింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య ఆదివారం రాత్రి తీరం దాటిందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. మరి కొద్ది గంటల్లో ఈ తుపాను(Gulab Cyclone) అల్పపీడనంగా మారి బలహీనపడునుందని చెప్పింది.
తుపాను తీరం దాటిన నేపథ్యంలో.. ఒడిశాలోని కోరాపుట్, రాయిగడ, గజపతి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని ఒడిశా వాతావరణ శాఖ డైరెక్టర్ హెచ్ఆర్ బిశ్వాస్ తెలిపారు. ఆయా జిల్లాల్లో 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు.
గులాబ్ తుపాను ఒడిశాలోని తీరప్రాంత జిల్లాలను వణికించింది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. గజపతి జిల్లాలోని కొండ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 1,600 మందిని రెస్క్యూ బృందాలు సురక్షిత ప్రదేశాలకు తరలించాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఒడిశా తీరం వెంబడి ఉన్న 11 జిల్లాల పాఠశాలలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.
అంతకుముందు... ఐఎండీ తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ అప్రమత్తమైంది. సహాయక చర్యల కోసం ఒడిశాకు 13 బృందాలు, ఆంధ్రప్రదేశ్‌కు 5 బృందాలను పంపించినట్లు ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ సత్యనారాయణ్ ప్రధాన్ తెలిపారు.
ఇవీ చదవండి: