బంగాళాఖాతంలో ఏర్పడిన అతి తీవ్ర తుపాను యాస్.. తీరానికి చేరువైంది. బుధవారం మధ్యాహ్నం ఒడిశాలోని బాలేశ్వర్ దక్షిణ ప్రాంతంలో తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రకటించింది. యాస్ తుపాను.. ఒడిశాలోని ధామ్రాకు 60 కి.మీ.ల దూరంలో, పారదీప్‌కు 90కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది. ఆ రాష్ట్రంలోని బాలేశ్వర్‌కు 105 కి.మీల దూరంలో, బంగాల్ దిఘాకు 240 కి.మీల దూరంలో ఉన్నట్లు చెప్పింది.
తుపాను భూమిని తాకుతున్న దృష్ట్యా.. ఒడిశా, బంగాల్, ఝార్ఖండ్‌లోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి మధ్యస్థ స్థాయిలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. ప్రభావిత ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
''తుపాను ప్రభావిత ప్రాంతాలైన భద్రక్, జగత్సింగ్పుర్, కటక్, బాలేశ్వర్, దేన్కనల్, జైపుర్, మయూర్బంజ్, కేంద్రపుర, కియోంజగఢ్ వంటి కొన్ని ప్రాంతాల్లో బుధవారం, గురువారం.. అతి భారీ వర్షాలు కురుస్తాయి.''
-ఐఎండీ
తాము బుధవారం మధ్యాహ్నానికి ఈ తుపాను తీరం దాటుతుందని అంచనా వేస్తున్నామని ఐఎండీ భువనేశ్వర్‌కు చెందిన సీనియర్ శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ తెలిపారు. తుపాను తీరం దాటే సమయంలో 130 నుంచి 140 కి.మీ.ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు.
తుపాను దృష్ట్యా ఒడిశా, బంగాల్‌లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని.. 11లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: అతి తీవ్ర తుపానుగా 'యాస్'