తౌక్టే తుపాను మరింత బలహీనపడి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ(ఐఎంండీ) తెలిపింది. ప్రస్తుతం దక్షిణ రాజస్థాన్, గుజరాత్ పరిసర ప్రాంతంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమై ఉందని బుధవారం ఉదయం వెల్లడించింది.
రానున్న రెండు రోజుల్లో ఈ వాయుగుండం ఈశాన్యం వైపు ప్రయాణించి రాజస్థాన్ మీదుగా పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌కు చేరుకుంటుందని పేర్కొంది. తూర్పు రాజస్థాన్‌లో స్పల్ప స్థాయి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధవారం మరికొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వెల్లడించింది. గుజరాత్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, దిల్లీలోనూ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వచ్చే 12 గంటల పాటు తూర్పు రాజస్థాన్, గుజరాత్ పరిసర ప్రాంతాల్లో గంటకు 45-55 కిమీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
అతిభీకర తుపానుగా రూపాంతరం చెందిన తౌక్టే.. సోమవారం అర్ధరాత్రి తర్వాత 1.30 గంటలకు గుజరాత్‌లోని దీవ్, ఉనాల మధ్య తీరం దాటింది. ఈ సమయంలో గుజరాత్ చిగురుటాకులా వణికిపోయింది. వివిధ ఘటనల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
దిల్లీలో ఆహ్లాదభరితం..
మరోవైపు, దిల్లీలో వాతావరణం ఆహ్లాదభరితంగా ఉంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 21.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. ఈ సీజన్ సగటు ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఐదు డిగ్రీలు తక్కువ అని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 1.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వెల్లడించింది. తౌక్టే ప్రభావంతో రాజధాని పరిసర ప్రాంతాల్లో వర్షం పడొచ్చని అంచనా వేసింది.
ఇదీ చదవండి: బలహీనపడిన తౌక్టే- గుజరాత్లో 13 మంది మృతి