ఇప్పుడు అందరూ కొవిడ్ వ్యాక్సిన్ గురించే ఆలోచిస్తున్నారు. దీన్నే సైబర్ నేరగాళ్లు ఆసరాగా మలుచుకుంటున్నారు. ఉన్న చోటనే ఉంటూ మన బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో... సైబర్ మోసాల బారిన పడకుండా ఉండడమెలాగో ఝార్ఖండ్ పోలీసులు చెబుతున్నారు.
ఎలా మోసగిస్తారు?
ఐవీఆర్ఎస్ సాంకేతిక సాయంతో ఫోన్ చేసి మాయమాటలు చెప్పి సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తారు. లేదా.. ఈమెయిల్ ద్వారా లింక్‌లు పంపుతారు. మనం ఆ లింకులను క్లిక్ చేసిన వెంటనే ఓ ప్రత్యేక సాఫ్ట్ వేర్ కూడా మన ఫోన్లలో చేరిపోతుంది. దాని సాయంతో హ్యాకర్లు మన ఫోన్లో ఏమేం చేస్తున్నామో ప్రతిదీ గమనిస్తారు. ఏ సందేశాలు మనకు వస్తున్నాయి? ఎవరితో మనం ఫోన్లో మాట్లాడుతున్నాం? అనే అంశాలపై కన్నేస్తారు. ఆ వివరాలతో ఇక సులువుగా మోసాలకు పాల్పడతారు.
మహమ్మారి పేరుతో మోసాలు...
కరోనా పరిస్థితుల మధ్య చాలా మంది తమ బ్యాంకు సంబంధిత సమాచారాన్ని ఫోన్లోనే దాచుకుంటున్నారు. ఇదే సైబర్ నేరగాళ్లకు ఆదాయాన్ని తెచ్చే మార్గంలా మారుతోంది. ఆరోగ్య అధికారుల్లాగా ఫోన్లు, మెసేజ్‌లు చేసి.. తప్పుడు లింకులను మన ఫోన్లోకి పంపుతున్నారు.
'అంతకుముందు.. ఏటీఎమ్ కార్డులను బ్లాక్ చేయడం లేదా రుణాలు పేరుతో మోసాలకు పాల్పడటం వంటివి చేసేవారు. కానీ, ఇప్పుడు ఏకంగా మన మొబైల్ ఫోన్లనే హ్యాక్ చేస్తున్నారు' అని రాంచీ ఎస్పీ సౌరవ్ తెలిపారు. దీనికోసం వారు తప్పుడు లింకులను ఫోన్లోకి పంపిస్తున్నారని చెప్పారు. కొవిడ్ కారణంగా ఇప్పుడందరూ భయాందోళనలో ఉన్నారని.. దీన్నే సైబర్ నేరగాళ్లు సద్వినియోగం చేసుకుంటున్నారని చెప్పారు.
మొదటగా వ్యాక్సిన్ మీకేనంటూ..
"ఇతరుల కంటే ముందుగా వ్యాక్సిన్ పొందాలనుకుంటున్నారా? అయితే రిజిస్ట్రేషన్ చేసుకొని నగదు చెల్లించండి" అంటూ సైబర్ నేరగాళ్లు ఆకర్షిస్తారు. అప్పుడు.. వారు పంపిన లింకును క్లిక్ చేశామంటే మన ఫోన్‌కు ఓ ఓటీపీ వస్తుంది. టీకా కావాలంటే ఆ ఓటీపీ చెప్పాలని ఒత్తిడి చేస్తారు. పొరపాటున వాళ్లు చెప్పినట్లు చేశామో ఇక అంతే సంగతులు.. మన ఖాతాల్లోని సొమ్ము ఖాళీ అవ్వాల్సిందే. అందుకే లింకుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతున్నారు పోలీసులు.
ఆధార్ నంబర్ చెప్పక్కర్లేదు
సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఉండాలంటే అవగాహన ఒక్కటే మార్గమని రాంచీ సైబర్ డీఎస్పీ యశోధర పేర్కొన్నారు. కొవిడ్ టీకాల కోసం ఆధార్ నంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదనే విషయం తెలుసుకోవాలని చెప్పారు. ఇప్పటివరకు ఆధార్‌కు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని అన్నారు.
ఇదీ చూడండి:కరోనా టీకా పేరుతో సైబర్ మోసాలు