ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరవైఫల్యంపై ఆత్మావలోకనం జరగాలన్న డిమాండ్ల మధ్య కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) నేడు సమావేశం కానుంది. శాసనసభ ఎన్నికలతో పాటు కరోనా సహా ఇతర అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఉదయం 11 గంటలకు వర్చువల్‌గా ఈ భేటీ జరగనుందని 'ఈటీవీ భారత్'తో సీడబ్ల్యూసీ సభ్యుడు ఒకరు తెలిపారు.
వరుస పరాజయాలు..
పార్లమెంటు ఎన్నికల తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో చాలా వరకూ కాంగ్రెస్ ఓడిపోయింది. తమిళనాడు మినహా ఇటీవల జరిగిన 4 రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఘోర పరాజయం ముట్టకట్టుకుంది. డీఎంకేతో కలిసి పోటీచేయటం వల్ల.. తమిళనాడులోని పలు స్థానాల్లో గెలుపొందింది.
2019లో అరుణాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, హరియాణా, 2020లో దిల్లీ, బిహార్ శాసనసభ ఎన్నికల్లోనూ హస్తం పార్టీ ఓటమిపాలైంది. జార్ఖండ్‌లో జేఎంఎంతో కలిసి పోటీచేయటం వల్ల కొన్నిస్థానాలు నిలబెట్టుకుంది. త్వరలో జరిగే ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం సంప్రదింపులు జరగాలని సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో జరగనున్న సీడబ్ల్యూసీ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
గుణపాఠంలా..
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఫలితాలు నిరాశపరిచినట్లు శుక్రవారం జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ సమావేశంలో ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పేర్కొన్నారు. ఈ ఓటమిని ఎంపీలంతా గుణపాఠంగా తీసుకోవాలని సూచించారు.
అంతకుముందు.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ న్యాయ శాఖ మంత్రి అశ్వనీ కుమార్.. ఈటీవీ భారత్‌తో మాట్లాడారు. కాంగ్రెస్ తమ వైఫల్యాలపై వాస్తవికతను గుర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు. పార్టీ మళ్లీ పునర్వైభవం సాధించేందుకు అన్ని స్థాయుల్లో చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: నిజాయతీ, పారదర్శక పాలన అందిస్తా: స్టాలిన్