'నాకు తెలుసు.. నేను దిల్లీ నేతలకు విరుద్ధంగా మాట్లాడుతున్నా. ఒకవేళ వారు పదవి వదులుకోవాలని కోరితే.. ఒక్క నిమిషం కూడ ఆలస్యం చేయను'.. ఈ వ్యాఖ్యలేవో పదవి విషయంలో పార్టీపై అసంతృప్తితో ఉన్న నేత మాట్లాడుతున్నారనుకుంటే పొరబాటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన ఓ రాష్ట్ర గవర్నర్ పలుకులివి. అవసరమైతే పదవికి రాజీనామా చేసి అయినా.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిలబడతానని చెబుతున్నారు. ఆయనే మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్..! ఇటీవల సంచలన ప్రకటనలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తన వాగ్ధాటితో అధికార పక్షాన్ని ఇరుకున పడేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో బలమైన నేతగా ఎదిగిన ఆయన పలు పార్టీల్లో చేరి ఇమడలేకపోయారు.
సత్యపాల్ మాలిక్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని హిస్వాడ గ్రామంలో జన్మించారు. ఆయన రాజకీయాల్లోకి రాకముందే బీఎస్సీ, న్యాయవిద్యను అభ్యసించారు. ఆయన రాజకీయాల్లో చరణ్‌సింగ్, వీపీసింగ్‌లకు చాలా సన్నిహితుడు. మాలిక్ తన కెరీర్‌లో పలు పార్టీలను మార్చారు. 1974లో మాజీ ప్రధాని చౌదరీ చరణ్ సింగ్ నేతృత్వంలోని భారతీయ క్రాంతి దళ్ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత లోక్‌దళ్‌లో చేరారు. 1984లో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజ్యసభ ఎంపీ అయ్యారు. కానీ, బోఫోర్స్ కుంభకోణం తర్వాత కాంగ్రెస్‌ను వీడి వీపీ సింగ్ నేతృత్వంలోని జనతాదళ్‌లో చేరారు. 1989లో అలీగఢ్ లోక్‌సభ స్థానాన్ని గెలుచుకొన్నారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో చరణ్ సింగ్ కుమారుడు అజిత్‌సింగ్‌పై భాజపా తరపున బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో మాలిక్ విజయం సాధించారు. పార్లమెంటరీ వ్యవహారాలు, పర్యాటకశాఖ మంత్రిగా పనిచేశారు.
గవర్నర్‌గా బదిలీలు..
సత్యపాల్ గవర్నర్ పదవీ నిర్వహణ ఇప్పటి వరకూ భిన్నంగా నడుస్తూ వచ్చింది. ఆయన ఈ పదవి చేపట్టినప్పటి నుంచి నాలుగు రాష్ట్రాలకు బదిలీ అయ్యారు. దీనిలో ఒడిశాకు గవర్నర్‌గా చేపట్టిన అదనపు బాధ్యతలు కూడా కలిపితే ఐదు రాష్ట్రాలు అవుతాయి. 2017లో ఆయన్ను బిహార్ గవర్నర్‌గా నియమించే నాటికి భాజపా కిసాన్ మోర్చా ఇన్-ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అప్పటికే భాజపా-జేడీయూ సర్కారుపై బిహార్‌లోని అనాథాశ్రమాల్లో సెక్స్ కుంభకోణం ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటన వార్తా కథనాలపై తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన బిహార్ ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసి సమస్య పరిష్కారానికి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఆయన్ను 2018 ఆగస్టులో కశ్మీర్ గవర్నర్‌గా బదిలీ చేశారు.
కశ్మీర్ స్వయంప్రతిపత్తి ఎత్తివేతలో..
కశ్మీర్‌లో ఉగ్రవాదం వ్యాపించిన 1980 తర్వాత గవర్నర్‌గా వచ్చిన తొలి రాజకీయ నాయకుడు సత్యపాల్ మాలిక్ కావడం విశేషం. కశ్మీర్ స్వయం ప్రతిపత్తి తొలగింపునకు ముందు భాజపా-పీడీపీ ప్రభుత్వం కూలిపోయింది. ఆ సమయంలో పీడీపీ ఇతర పక్షాల మద్దతు కూడ గట్టుకొని ఆయన్ను కలిసేందుకు ప్రయత్నించినా కుదర్లేదు. దీంతో ఫ్యాక్స్ ద్వరా మద్దతు లేఖ పంపారు. కానీ, తన కార్యాలయంలో ఫ్యాక్స్ యంత్రం పనిచేయడంలేదని.. ఆ లేఖ అందలేదని మాలిక్ వెల్లడించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారు. అనంతర పరిణామాల్లో కేంద్రం కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేసింది. ఈ సందర్భంగా మాలిక్ ఓ పత్రికతో మాట్లాడుతూ 'మాజీ ముఖ్యమంత్రులు ఓ యాభై మందిని వెంటేసుకొచ్చి రాజ్ భవన్‌ను కాల్చేస్తామంటే.. మేము ఫైరింగ్‌కు ఆదేశాలిస్తాం.. ఇవ్వకూడదా..?' అని వ్యాఖ్యానించారు.
కశ్మీర్‌లో మోదీ ప్రభుత్వ అనుమతులు లేకుండానే రాజకీయ భేటీలు ఏర్పాటు చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో ఆయన్ను గోవాకు బదిలీ చేశారు. అక్కడ ప్రమోద్ సావంత్ ప్రభుత్వంతో విభేదాలు తలెత్తాయి. ఫలితంగా కేంద్రం మాలిక్‌ను మేఘాలయకు పంపింది.
భాజపాపై అసంతృప్తి దేనికి..
నాలుగేళ్లలో నాలుగు సార్లు బదిలీ చేయడం ఆయన్ను కొంత ఇబ్బంది పెట్టింది. దీనికి తోడు ప్రస్తుతం 75 ఏళ్ల వయస్సున్న మాలిక్‌కు పార్టీలో చురుకైన రాజకీయాల్లో పాల్గొనే అవకాశం భవిష్యత్తులో ఏ మాత్రం లేదు. ఈ విషయాలపై అసంతృప్తి ఉన్నా.. మేఘాలయలో కొన్ని నెలల పాటు ఆయన మౌనంగానే ఉన్నారు. ఆ తర్వాత రైతుల ఆందోళన ఆయనకు ఆయుధంలా దొరికింది. ఆయన భాజపా కిసాన్ మోర్చాలో పనిచేసి ఉండటంతో.. రైతు బిల్లులపై తన వైఖరి వెల్లడించేందుకు ప్రభుత్వ వ్యతిరేక ప్రకటనలు చేయడం మొదలుపెట్టారు. ఇక మోదీ సర్కారుపై ఆయన విమర్శకులకు సరైన కారణాలు కనిపించడంలేదు. అదే సమయంలో మోదీ సర్కారు కూడా కొంత ఓర్పుగానే వ్యవహరిస్తోంది. గతంలో కూడా మాలిక్ పనితీరు నచ్చక పోతే ప్రభుత్వం ఒక చోటి నుంచి మరోచోటుకు బదిలీ చేసిందే కానీ.. ఆయన్ను పూర్తిగా పక్కకు పెట్టకపోవడం గమనార్హం.
ఇదీ చూడండి: 'పార్లమెంట్‌కు రైతులు.. ఎక్కడ ఆపితే అక్కడే నిరసన'