బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో షారుక్ నుంచి డబ్బు డిమాండ్ చేశారనే ఆరోపణలపై తమ శాఖ జోనల్ డైరెక్టర్‌పై సమీర్ వాంఖడేపై (NCB Sameer Wankhede) ఎన్‌సీబీ.. విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జ్ఞానేశ్వర్ సింగ్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల బృందాన్ని దర్యాప్తు కోసం నియమించింది. విచారణ బృందం..రేపు దిల్లీ నుంచి ముంబయికి వెళ్లి ఆరోపణలపై దర్యాప్తు చేయనుంది. ప్రాథమిక ఆధారాలను బట్టి... ఎన్సీబీ అధికారిగా వాంఖడేను కొనసాగించేదిలేనిదీ నిర్ణయించనున్నట్లు జ్ఞానేశ్వర్ చెప్పారు.
కోర్టులో వాంఖడే అఫిడవిట్
మరోవైపు, మాదక ద్రవ్యాల కేసు (Cruise Drug Case) నుంచి ఆర్యన్ ఖాన్‌ను విడిపించేందుకు రూ.25 కోట్లు ఇవ్వాలని అధికారులు అడిగినట్లు వచ్చిన ఆరోపణలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే (NCB Sameer Wankhede) సైతం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఇదంతా దర్యాప్తునకు ఆటంకం కలిగించేందుకు చేసే ప్రయత్నమేనని అన్నారు. ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. తాను చేపట్టిన నిస్పాక్షిక విచారణ (NCB Drug case Bollywood) కొందరి స్వార్థప్రయోజనాలకు అనుగుణంగా లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తనకు అరెస్టయ్యే ముప్పు ఉందని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌పై పరోక్షంగా ఆరోపణలు చేశారు వాంఖెడే. ఆయన అల్లుడిని ఎన్సీబీ అరెస్టు చేసినందుకు.. తనను లక్ష్యంగా చేసుకొన్నారని అన్నారు. తాను అమాయకుడినని నిరూపించుకునేందుకు ఎలాంటి దర్యాప్తుకైనా సిద్ధమని స్పష్టం చేశారు.
"సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులకు ప్రస్తుత కేసుతో సంబంధం ఉంది. ఈ కేసు విషయంలో నన్ను అరెస్టు చేయడం సహా అన్ని రకాలుగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. న్యాయస్థానం ఈ అధికారుల నైతికస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు జరిగే ప్రయత్నాలను, నిజం బయటకు రాకుండా అధికారులపై బెదిరింపులకు పాల్పడటం వంటి విషయాలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోవాలి."
-సమీర్ వాంఖెడే, ఎన్సీబీ జోనల్ అధికారి
కాగా, తమ అధికారులపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఎన్సీబీ (NCB Mumbai) అఫిడవిట్ దాఖలు చేసింది. వాంఖెడే సహా ఎన్సీబీలో అధికారులందరూ నిబద్ధత, నిజాయతీతో పనిచేస్తున్నారని తెలిపింది. ముంబయిని మాదక ద్రవ్యాల రహిత నగరంగా మార్చేందుకు కృషి చేస్తున్నారని వివరించింది.
'రక్షణ కల్పించండి'
రూ.25 కోట్ల లంచం ఆరోపణలు చేసిన సాక్షి ప్రభాకర్ సెయిల్... తనకు రక్షణ కల్పించాలని ముంబయి కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. తనకు సమీర్ వాంఖెడే నుంచి ప్రాణహాని ఉందని మీడియాతో చెప్పారు. కమిషనర్ కార్యాలయానికి వెళ్లిన ప్రభాకర్‌ను పోలీసు భద్రత మధ్య అందేరీకి తరలించారు.
'బండారం బయటపెడతాం'
క్రూజ్ డ్రగ్స్ కేసు ద్వారా మహారాష్ట్రకు చెడ్డపేరు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. కొందరు అధికారుల బండారం బయటపెడతామని వ్యాఖ్యానించారు. ఆర్యన్ ఖాన్ అరెస్టుకు సంబంధించిన ఫొటోల్లో ఉన్న సామ్ డిసౌజ అనే వ్యక్తి ముంబయిలోనే అతిపెద్ద మనీలాండరింగ్ నిందితుడని అన్నారు. రాజకీయ నేతలు, ఉన్నతాధికారులతో అతడికి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.
'వివాహంపై వివాదం'
అంతకుముందు, వాంఖెడే వివాహం, మతం విషయమై వివాదం చెలరేగింది. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ (Nawab Malik news).. వాంఖెడే తొలి వివాహానికి సంబంధించిన ఫొటోలోని కొంత భాగాన్ని ట్వీట్ చేశారు.
దీనిపై స్పందిస్తూ ప్రకటన విడుదల చేశారు వాంఖెడే. తనను సమీర్ దావుద్ వాంఖెడే అంటూ మంత్రి పేర్కొనడాన్ని తప్పుబట్టారు. తొలి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత రెండో పెళ్లి చేసుకున్నానని వివరించారు. తనది సంప్రదాయ లౌకిక కుటుంబమని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఆర్యన్ ఖాన్ కేసులో కొత్త ట్విస్ట్.. విడిపించేందుకు డీల్!