Criticism on CID Chief Sanjay and Additional AG Ponnavolu: సీఐడీ చీఫ్ సంజయ్, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డిల తీరుపై.. మాజీ బ్యూరోక్రాట్లు, సీనియర్ నాయకులు, న్యాయనిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాము చెప్పాలనుకున్న విషయాన్ని పదేపదే చెబుతూ చెబుతూ.. వాస్తవాల్ని వక్రీకరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మీడియా సమావేశాల్లో విలేకరులు సూటిగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు లేక.. విషయాన్ని పక్కదారి పట్టిస్తూ హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్లో ఈ ఇద్దరు అధికారులు విన్యాసాలు ప్రదర్శించడం, అధికారవర్గాల్లో కలకలం రేపుతోంది. ఇది చాలదన్నట్టు దిల్లీలోనూ ప్రెస్‌మీట్ పెడతారని చెప్పడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రానికి సంబంధించిన కేసు వివరాల్ని పొరుగు రాష్ట్రంలో, దేశ రాజధానిలో ప్రెస్‌మీట్ పెట్టి చెప్పాల్సిన అగత్యమేంటి. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా సేవలు చేసిన నాయకుడ్ని.. ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసిందే కాకుండా, దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండగానే, ప్రెస్‌మీట్లు పెట్టి వ్యాఖ్యానాలు చేయడం రాజకీయ కుట్రలో భాగం కాదా అని మాజీ బ్యూరోక్రాట్లు ప్రశ్నిస్తున్నారు. ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ.. ఒక పార్టీ ఎజెండాని భుజాలకెత్తుకోవడం సిగ్గు చేటు కాదా అని నిలదీస్తున్నారు.
పొన్నవోలు సుధాకర్‌రెడ్డిది రాజకీయ నియామకం. సీఎం జగన్ పునర్జన్మ ఇచ్చారని బహిరంగంగానే ప్రకటించుకోవడానికి ఆయన కొంచెం కూడా మోహమాటపడటం లేదు. కాబట్టి.. నైపుణ్యాభివృద్ధి కేంద్రాల కేసులో ఆయన నుంచి అంత కంటే నిష్పాక్షికతను ఆశించలేం. కానీ సీఐడీ చీఫ్ సంజయ్ తీరుపైనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
నైపుణ్యాభివృద్ధి కేసులో కీలకంగా వ్యవహరించిన అధికారుల్ని ఎందుకు నిందితులుగా చేర్చలేదని విలేకరులు అడిగితే.. ఆయన నీళ్లు నమిలారు. ఆ తర్వాత పైనుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకు ఆ అధికారులు పనిచేశారని చెప్పారు. మరి ఈ కేసులో ఎవరి నుంచి వచ్చిన ఒత్తిళ్ల వల్ల ఆయన రాజకీయ నాయకుడీలా ప్రెస్మీట్లు పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు.
అదనపు అడ్వొకేట్ జనరల్ సుధాకర్‌రెడ్డి.. తన స్వామి భక్తిని బహిరంగానే ప్రదర్శించాడు. ఏఏజీ అంటే ప్రభుత్వం తరపున కోర్టులో వాదించే న్యాయవాది అంతే. గతంలోనుంచే ప్రభుత్వాలు తమకు అనుకూలంగా ఉండేవారిని మాత్రమే ఏఏజీలుగా నియమించే సంప్రదాయం ఉంది. గత ప్రభుత్వంలోనూ ఏఏజీలుగా కొందరు పనిచేశారు. కానీ, వారు ఈ విధంగా అధికార పార్టీపై బహిరంగంగానే వీర విధేయత చూపించిన దాఖలాల్లేవు.
జగన్‌పై తన భక్తి ప్రపత్తుల్ని చాటుకోవడంలో సుధాకర్ రెడ్డి ఎప్పుడు వెనకకు తగ్గలేదు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత మరింతగా మొతాదు పెంచి బహిరంగంగా స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారు. వ్యాఖ్యానాలు చేసేస్తున్నారు. టీవీ, యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడమే ఆయన ప్రధాన భాద్యతగా పెట్టుకున్నారు. చట్టాలు, న్యాయశాస్త్ర విలువలు, కోర్టుల గౌరవాన్ని ఏఏజీ సుధాకర్ రెడ్డి దిగజారుస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
అదనపు డీజీగా ఉన్న ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఎంతో హుందాగా వ్యవహరించాలి. తన కింద పనిచేసే అధికారులకు ఎంతో స్పూర్తిగా నిలవాలి. రాష్ట్ర చరిత్రలో అత్యంత కీలకమైన కేసు కోర్టులో విచారణలో ఉన్నప్పుడు, జరిగిందో లేదో తెలియని స్కాంకు బాధ్యుడిగా చెబుతూ మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి సమయంలో.. రాజకీయ పార్టీ ఎన్నికల ప్రచారం చేసుకున్నట్టుగా, సీఐడీ ఎక్కడిక్కడ ప్రెస్మీట్లు పెట్టి ప్రచారం చేయటమే తప్పు.
పైగా దర్యాప్తులో చేరతారా? అంటూ అడగడమేంటి? కేసులో సంజయ్ దర్యాప్తు అధికారి కాదు.. పర్యవేక్షణ అధికారి మాత్రమే. మరి ఆయన ప్రెస్మీట్లు పెట్టి కేసు వివరాల్ని వెల్లడించడమేంటని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏ కేసులోనైనా అలా చేస్తాయా..! మరీ సంచలనాత్మకమైన కేసు అయితే.. ఒక ప్రెస్‌మీట్ పెట్టి సూటిగా విషయం చెబుతాయని నిపుణులు అంటున్నారు. అంతే తప్ప.. ఊరూరా ప్రెస్మీట్లు ఏంటని.. కేసు దర్యాప్తునకే పరిమితం కావాల్సిన సీఐడీ ఆధారాల్లేవని చెబుతూనే, పలానా వారే తప్పు చేశారనడమేంటనే విమర్శలు చెలరేగుతున్నాయి.
దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండగా, ఛార్జిషీటు ఫైల్ చేయకముందే పోలీసులు కేసు వివరాల్ని బహిర్గతం చేయడం నిబంధనలకు విరుద్ధమని విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ అభిప్రాయపడ్డారు. సెక్షన్ 184 కింద మెజిస్ట్రేట్ ఎదుట ఇచ్చిన వాంగ్మూలాన్ని పోలీసులు బహిరంగ పరచడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని జడ శ్రావణ్ కుమార్ వంటి న్యాయవాదులు చెబుతున్నారు. వీటికి మీ సమాధానమేంటని సీనియర్ ఐపీఎస్‌లు సంజయ్‌ను ప్రశ్నిస్తున్నారు.