crime news: దిల్లీలో ఓ దుండగుడు రెచ్చిపోయాడు. ఓ తుక్కు వ్యాపారిపై కత్తితో దాడి చేశాడు. వ్యాపారి కిషన్ నగదు లెక్కిస్తున్న సమయంలోనే కత్తితో పొడిచాడు దుండగుడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. రెండురోజుల క్రితం తిలక్‌నగర్‌లోని చౌఖండి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. డబ్బుల కోసమే ఈ దురాగతానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
కత్తితో బెదిరించి సాయుధుడు డబ్బులు డిమాండ్ చేయడం సీసీటీవీ దృశ్యాల్లో కనిపిస్తోంది. అయితే, అతడి ప్రయత్నాలు ఫలించలేదు. కత్తితో పొడిచినప్పటికీ.. వ్యాపారి కిషన్ డబ్బులు ఇవ్వలేదు. గట్టిగా అతడి చెయ్యిని పట్టుకున్నాడు. ఆలోపే చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చారు. దీంతో సాయుధుడు ఉడాయించాడు. కిషన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని తెలుస్తోంది. సాయుధుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Samosa conflict MP kills one: మధ్యప్రదేశ్ భోపాల్‌లోని చోలా మందిర్ ప్రాంతంలో.. దారుణం జరిగింది. సమోసాపై ప్రారంభమైన గొడవ ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. స్థానిక శంకర్‌నగర్‌లో నివసించే వినోద్ అహిర్వార్ అనే మెకానిక్.. హరిసింగ్, అతడి కుమారుడు సీతారామ్ నిర్వహించే టీ స్టాల్‌కు ఆదివారం సాయంత్రం వెళ్లాడు. టీ తాగుతూ.. అక్కడే ఉన్న పళ్లెంలో నుంచి ఓ సమోసాను తీసుకొని తిన్నాడు. దీంతో సీతారామ్, అహిర్వార్ మధ్య వాగ్వాదం మొదలైంది. సమోసా తినొద్దని సీతారామ్ వారించగా.. అహిర్వార్ దుర్భాషలాడాడు. దీంతో కోపోద్రికులైన సీతారామ్, హరిసింగ్.. అహిర్వార్‌పై దాడి చేశారు. ఈ క్రమంలోనే టీ తయారు చేసే గిన్నెను తలకేసి కొట్టారు. కర్రలతోనూ దాడి చేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే పడిపోయాడు అహిర్వార్.ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. దాడి చేసిన తండ్రీకొడుకులపై హత్య కేసు నమోదు చేసుకొని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
brother shot sister in UP: ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో ఘోరం జరిగింది. సొంత చెల్లిపై కాల్పులు జరిపాడు ఓ వ్యక్తి. తన భార్యను అనుమానించిందన్న కోపంతో ఆమెను హత్య చేశాడు. ప్రతాప్‌గఢ్‌లోని బసావన్ రామచంద్రాపుర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
మృతురాలి పెద్దన్న దేవేంద్ర శుక్లా చెప్పిన వివరాల ప్రకారం.. తన సోదరి గుడియా మొబైల్ ఫోన్ మూడు రోజుల క్రితం పోయింది. ఈ విషయంపై తన అన్న ధీరజ్ శుక్లా భార్య కాంచన్‌ను ఆరా తీసింది గుడియా. కాంచనే దొంగతనం చేసి ఉంటుందని ఆరోపించింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని ధీరజ్ ఆదివారం రాత్రి.. గుడియాపై పిస్తోల్‌తో కాల్పులు జరిపాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె చనిపోయింది. పోలీసులు సమాచారం అందుకొని.. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: స్కూల్ బస్సులో మంటలు.. లక్కీగా పిల్లలంతా...