త్రిపురలో భాజపా, సీపీఎం కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. రాజ్‌నగర్ బజార్‌లో సీపీఎం నాయకులపై కొందరు కర్రలు, రాడ్‌లతో దాడులు చేశారు. ఈ ఘటనలో సీపీఎం ఎమ్మెల్యే తీవ్రంగా గాయపడ్డారు.
భాజపా ప్రభుత్వ తీరుకు నిరసనగా త్రిపుర వ్యాప్తంగా.. వామపక్ష పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా రాజ్‌నగర్ బజార్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీపీఎం నేతలు ప్రసంగించే సమయంలో ఒక్కసారిగా ఒక దుండగుల గుంపు.. వచ్చి రాడ్‌లతో అక్కడున్న అందరిపై విచక్షణా రహితంగా దాడి చేసింది. తాము పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు భాజపా నాయకులే ఈ దాడులు చేయించారని సీపీఎం ఆరోపించింది. దాడితో తీవ్ర ఆగ్రహానికి గురైన సీపీఎం కార్యకర్తలు భాజపా కార్యకర్తలపై దాడిచేయటం వల్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
ఘర్షణను ఆపేందుకు యత్నించిన సీపీఎం ఎమ్మెల్యే సుధాన్ దాస్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన తల, చేతులకు గాయాలయ్యాయి. ఘర్షణ సమయంలో తమ కార్యకర్తల్ని ఆపేప్రయత్నం చేసిన భాజపా మండల అధ్యక్షుడు రంజిత్ సర్కార్ కూడా గాయపడ్డారు. పోలీసులు ఘర్షణను ఆపేందుకు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఎమ్మెల్యే దాస్‌ను తొలుత స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. మెరుగైన చికిత్స కోసం తరలిస్తుండగా భాజపా కార్యకర్తలు రహదారిని దిగ్భంధించే ప్రయత్నం చేశారు. తర్వాత దాస్‌ను జిల్లా ఆసుపత్రికి, అక్కడి నుంచి జీబీ పంత్ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన తర్వాత సీపీఎం ఎమ్మెల్యే దాస్ ఇంటిపై భాజపా కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో ఎమ్మెల్యే భార్య జయా బెనర్జీ ఛాతిపై గాయాలయ్యాయి. ఘర్షణల్లో ఇరువైపులా మొత్తం 13 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: మహిళపై చేయి చేసుకున్న పోలీసు- వీడియో వైరల్