కాంగ్రెస్, సీపీఎంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. కేరళలో కాంగ్రెస్, సీపీఎంలు ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ.. బంగాల్లో మాత్రం పొత్తు కుదుర్చుకుని ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ రెండు పార్టీలు సైద్ధాంతిక గందరగోళాన్ని ఎదుర్కొంటున్నాయని ఎద్దేవ చేశారు. కేరళలోని చాకరక్కల్ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి సీ.కే.పద్మనాభన్కి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో ఈ మేరకు వ్యాఖ్యానించారు.
బంగారం స్మగ్లింగ్ కుంభకోణంలో ముఖ్యమంత్రి కార్యాలయం ప్రమేయం ఉందని ఆరోపించిన నడ్డా.. దీనిపై దర్యాప్తు చేస్తోన్న కేంద్ర ఏజెన్సీలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని మండిపడ్డారు.
భాజపాకే చిత్తశుద్ధి..
తమ పార్టీ మాత్రమే శబరిమల ఆలయంపై చిత్తశుద్ధితో ఉందని.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్, సీ.కే.పద్మనాభన్ చాలాకాలంగా ఈ సమస్యపై పోరాడుతున్నారని నడ్డా వివరించారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై జరిగిన ఆందోళనలను అణిచివేసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నించారని మండిపడ్డారు.
మోదీతోనే అభివృద్ధి..
2011లో శబరిమల వద్ద జరిగిన తొక్కిసలాటలో 106 మంది భక్తులు మరణించినా.. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాలేదని.. అయితే 2016 ఏప్రిల్‌లో పుట్టింగల్ ఆలయంలో భారీ పేలుడు సంభవించి 114 మరణించిన ఘటనలో ప్రధాని నరేంద్ర మోదీ బాధితులను పరామర్శించారని నడ్డా గుర్తు చేశారు. మోదీతో కలసి నడిస్తేనే కేరళలో అభివృద్ధి సాధ్యమని నడ్డా వివరించారు. మెగా ప్రాజెక్టులను రాష్ట్రానికి తీసుకువస్తామని.. విద్య, ఆరోగ్య రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: పోలీసు చొరవ, బైకర్ సాహసంతో బామ్మకు మందులు