ప్రస్తుతం 18ఏళ్లు పైబడిన వారికి టీకా ప్రక్రియ కొనసాగుతోంది. మరి పిల్లలకు ఎప్పుడు టీకా అందుబాటులో వస్తుందన్న ప్రశ్నలకు తెరదించారు ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా. వచ్చే వారాల్లో లేదా సెప్టెంబరులోపే పిల్లలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులో వచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
"గుజరాత్‌కు చెందిన ఫార్మా దిగ్గజం జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్-డీ, ప్రపంచంలోనే డీఎన్‌ఏ ఆధారంగా తయారైన తొలి కొవిడ్ టీకా. జులై 1న కంపెనీ అత్యవసర అనుమతుల కోసం డీసీజీఐకి దరఖాస్తు చేసుకొంది. 12 ఏళ్లకు పైబడిన వారిపై తమ టీకా పని చేస్తుంది. టీకా చిన్నారులపై ప్రయోగాలు పూర్తయింది. ఇక పిల్లలపై కొవాగ్జిన్ ట్రయిల్స్ సైతం త్వరలోనే పూర్తి కానున్నాయి. టీకా ఆమోదానికి సంబంధించి అపెక్స్ డ్రగ్ రెగ్యూలేటర్‌కు ఆమోదానికి పంపాం. వాటి నుంచి అనుమతులు రాగానే వెంటనే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తాం. ఇప్పటి వరకూ 12 ఏళ్లలోపు పిల్లలకు అమెరికా వ్యాక్సిన్లు ఫైజర్, మోడెర్నా వేసేందుకు అనుమతి లభించింది. ఈ రెండు ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీతో అభివృద్ధి చెందినవి." అని తెలిపారు.
మరోవైపు కొవాగ్జిన్ ట్రయల్స్ 12-18 ఏళ్లు, 6-12 ఏళ్లు మధ్య పిల్లలకు రెండు డోసుల టీకా ప్రయోగం పూర్తయింది. ఇప్పటికే 2-6 ఏళ్ల మధ్య చిన్నారులకు తొలిడోసు టీకా ఇవ్వగా.. రెండో డోసు టీకా ఇవ్వాల్సి ఉందని ఎయిమ్స్ తెలిపింది.
ఇక ఇప్పటివరకూ 45.37 కోట్ల జనాభాకి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తికాగా.. 11కోట్ల డోసుల టీకాలు సిద్ధంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 21 నుంచి ఉచిత టీకా ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మెగా డ్రైవ్ కోసం కేంద్ర ప్రభుత్వం 75 శాతం టీకాలను తయారీదారుల నుంచి కొనుగోలు చేసి రాష్ట్రాలకు అందిస్తోంది. మిగిలిన 25 శాతం టీకాలను ప్రైవేటు ఆస్పత్రులు కొనుగోలు చేస్తున్నాయి. ఇక టీకా అందించినందుకు సేవా రుసుము రూ. 150కి మించరాదని కేంద్రం ప్రైవేటు ఆస్పత్రులకు నిబంధన విధించింది. ఇది ప్రైవేటులో లభించే టీకా ధరకు ఇది అదనం. దీనికి సంబంధించిన పర్యవేక్షణ బాధ్యతలను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది.
ఇదీ చూడండి: కేరళలో మరో ఇద్దరికి జికా వైరస్