Covid Third wave: దేశంలోని ప్రధాన నగరాల్లో నమోదవుతున్న కరోనా కేసుల్లో సగానికిపైగా ఒమిక్రాన్ కేసులే ఉండడం.. మూడోదశకు సంకేతమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రోగనిరోధకతపై జాతీయ సాంకేతిక సలహా గ్రూప్ (ఎన్టీఏజీఐ) ఛైర్‌పర్సన్ డాక్టర్ ఎన్కే ఆరోరా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా దేశంలో పెరుగుతున్న కేసులు థర్డ్‌వేవ్‌కు సంకేతమని తెలిపారు. అయితే.. భయపడాల్సిన పని లేదని స్పష్టం చేశారు.
"భారత్, దక్షిణాఫ్రికాలో వైరస్ వ్యాప్తి ఒకే రీతిలో ఉంటుంది. దేశంలో త్వరలోనే థర్డ్‌వేవ్ గరిష్ఠానికి చేరుకుంటుంది. అయినా.. భయపడాల్సిన పని లేదు. దక్షిణాఫ్రికాలో కేసులు ఒకేసారి పెరిగి, రెండు వారాల్లోనే తగ్గుదల నమోదైంది. భారత్‌లో కూడా ఇలానే ఉంటుంది. పైగా భారత్‌లో టీకా తీసుకున్నవారి సంఖ్య ఎక్కువ. ఇప్పటివరకు టీకాలు తీసుకోని వారు, ఒక డోసు టీకా మాత్రమే తీసుకున్న వారు వెంటనే టీకాలు వేసుకోవాలి."
-డాక్టర్ ఆరోరా, ఎన్టీఏజీఐ ఛైర్‌పర్సన్
Omicron Cases in India: దక్షిణాఫ్రికాలో నమోదైన ఒమిక్రాన్ కేసుల్లో చాలా వరకు లక్షణాలు లేనివి, తక్కువ వ్యాధి తీవ్రత ఉన్నవే అన్న విషయాన్ని డాక్టర్ ఆరోరా గుర్తు చేశారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు భారీగా నమోదైనా.. ఆస్పత్రిలో చేరికలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయన్నారు. కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఒమిక్రాన్ వెలుగు చూసిన దక్షిణాఫ్రికాలో ఒకదశలో రోజువారీ కేసుల సంఖ్య 35 వేలు దాటగా ప్రస్తుతం సోమవారం దేశంలో 3 వేల కొవిడ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి.
ఇదీ చదవండి: ఆ ఆసుపత్రిలో మరో 72 మంది వైద్యులకు కరోనా