దేశంలో కరోనా మూడో దశ వ్యాప్తి అక్టోబర్ నెలలో తీవ్ర స్థాయికి చేరే అవకాశం ఉందని ఐఐటీ పరిశోధకులు అంచనా వేశారు. రెండో దశ ముగింపును కచ్చితత్వంతో అంచనా వేసిన గణిత మోడల్ ఆధారంగా ఈ విషయం కనుగొన్నారు. మహమ్మారి తీవ్రస్థాయికి వెళ్లడం ఈ(ఆగస్టు) నెలలోనే ప్రారంభమవుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే, మూడో దశ వ్యాప్తి పరిమిత స్థాయిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. రోజుకు లక్ష నుంచి లక్షన్నర కేసులు బయటపడే అవకాశం ఉందని అంచనా వేశారు.
కొవిడ్ వ్యాప్తి రేటు అధికంగా ఉన్న కేరళ, మహారాష్ట్ర పరిస్థితులను ప్రభావితం చేస్తాయని పరిశోధకులు వివరించారు. ఐఐటీ హైదరాబాద్, కాన్పుర్‌కు చెందిన మతుకుమల్లి విద్యాసాగర్, మణీంద్ర అగర్వాల్ నేతృత్వంలో ఈ అధ్యయనం జరిగింది.
"రెండో వేవ్‌తో పోలిస్తే తర్వాతి వేవ్ చాలా చిన్నది. కానీ మనం జాగ్రత్తగా ఉండాల్సిన విషయాన్ని ఇది సూచిస్తోంది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి. కొవిడ్ హాట్స్పాట్లను గుర్తించాలి. కొత్త వేరియంట్లను జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా గుర్తిస్తూ ఉండాలి."
-పరిశోధకులు
మూడో వేవ్ తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రజలు నిర్లక్ష్యంగా ఉండటం పట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలి దశ వ్యాప్తి వల్ల నష్టం తక్కువగానే ఉన్నందున.. ప్రయాణాలు, ఇతర ఆంక్షలను సడలించారని.. తద్వారా వైరస్ వ్యాప్తి తీవ్రమైందని చెప్పారు. మూడో వేవ్ పరిస్థితులను పూర్తిగా మార్చేసిందని చెప్పారు.
తీవ్రత తగ్గడానికి కారణమిదే
అయితే, మెజారిటీ దేశ జనాభాకు ఇమ్యూనిటీ లభించిందని పరిశోధకులు వివరించారు. ఆరేళ్లు పైబడిన వారిలో మూడింట రెండొంతుల జనాభాలో యాంటీబాడీలు అభివృద్ధి చెందాయని తెలిపారు. మూడో వేవ్ తీవ్రత తగ్గేందుకు ఇదే కారణమని పేర్కొన్నారు.
టీకా పంపిణీ పెరగాలి
గతకొద్దిరోజులుగా దేశంలో రోజుకు 40 వేల కేసులు బయటపడుతున్నాయి. ఇందులో దాదాపు సగం కేసులు కేరళ నుంచే వస్తున్నాయి. మిగిలిన పెద్ద రాష్ట్రాల్లో కొవిడ్ తీవ్రత సాధారణంగా ఉంది. ఒకవేళ ఆయా రాష్ట్రాల్లోనూ కేసులు పెరిగితే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితి మారిపోతుందని కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రొఫెసర్ పాల్ కట్టుమన్ పేర్కొన్నారు. హెర్డ్ ఇమ్యూనిటీ సాధించేవరకు టీకా పంపిణీ వేగంగా జరగాలని సూచించారు.
ఇదీ చదవండి: