దిల్లీలో కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చుతోందన్నారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. మాస్కులు, శానిటైజర్లు వాడాలన్నారు. భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఆసుపత్రుల్లోని పడకలను అత్యవసరమైన వారికోసం కేటాయించామని.. వైరస్ బారినపడ్డవారు ఆసుపత్రికి వెళ్లకుండా ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు.
"దేశ రాజధానిలో కరోనా తీవ్రరూపం దాల్చుతోంది. నాలుగోసారి ప్రమాదకర స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. 2020 నవంబర్‌లోని వైరస్ ఉచ్ఛస్థితి(పీక్)కంటే ప్రస్తుతం తీవ్రత ఎక్కువంగా ఉంది. ఇది మరింత ప్రమాదకరం.''
-- అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి
కరోనాపై పోరాటానికి లాక్డౌన్ పరిష్కారం కాదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఆసుపత్రుల వ్యవస్థ దెబ్బతిన్నప్పుడే లాక్డౌన్ విధించాలన్నారు. కొవిడ్‌పై పోరుకు అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా రావాలని పిలుపునిచ్చారు.
రికార్డు స్థాయిలో కేసులు:
దిల్లీలో ఆదివారం రికార్డు స్థాయిలో 10,732 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి సమయం నుంచి.. ఒక్కరోజులో దిల్లీలో నమోదైన అత్యధిక కేసులు ఇవేనని కేజ్రీవాల్ అన్నారు. చివరగా 2020, నవంబర్ 11న అత్యధికంగా 8,593 కేసులు నమోదైనట్లు గుర్తు చేశారు.
ఇదీ చదవండి : కరోనాపై ఇది రెండో పెద్ద యుద్ధం: మోదీ