Corona fourth wave in india: దేశంలో కరోనా మూడో దశ ప్రభావం క్రమంగా తగ్గుతోంది. కేసులు దిగివస్తున్నాయి. ఇదిలా ఉంటే కాన్పూర్ ఐఐటీకి చెందిన పరిశోధకులు కీలక విషయాలను వెల్లడించారు. వచ్చే జూన్‌లో భారత్‌లో కొవిడ్ నాలుగో వేవ్ మొదలయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. జూన్ 22 నుంచి అక్టోబర్ 24 వరకు ఫోర్త్ వేవ్ ప్రభావం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఈ దశ తీవ్రత ఎలా ఉండనుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. కొత్త వేరియంట్లు, మ్యుటేషన్లు, వ్యాక్సిన్లు, బూస్టర్ డోసుల ప్రభావం ఆధారంగా నాలుగో దశ తీవ్రత ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.
ఇందుకు సంబంధించిన అధ్యయనం ప్రీప్రింట్ సర్వర్ మెడ్‌రిక్సివ్‌లో ఇటీవలే ప్రచురితమైంది. ఫోర్త్ వేవ్ దాదాపు నాలుగు నెలల పాటు ఉంటుందని, ఆగస్టు 15 నుండి 31 వరకు కేసుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుని, ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని వివరించింది. గత మూడు వేవ్‌ల సమయంలో కొవిడ్ కేసులు, పీక్ టైమ్, మరణాల సంఖ్యలో ఐఐటీ కాన్పుర్ పరిశోధకుల బృందం వేసిన అంచనాలు దాదాపు నిజమయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజా అధ్యయనం కూడా నిజమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే అలసత్వం వహించొద్దని, ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.
'భారత్‌లో నాలుగో దశ జూన్ 22న మొదలై, ఆగస్టు 23 పీక్ స్టేజ్‌కి చేరుకొని, అక్టోబర్ 24న ముగియనుందని అంచనా' అని శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. ఈ అంశాలను పరిశోధించేందుకు వారు 'బూస్ట్‌స్ట్రాప్' అనే పద్ధతిని ఉపయోగించారు. దీని ద్వారా ఇతర దేశాల్లో రాబోయే వేవ్‌లను కూడా అంచనా వేయొచ్చని తెలిపారు.
ఇదీ చూడండి: గడ్డకట్టే చలిలో ఐస్వాల్ క్లైంబింగ్.. ఔరా అనిపించేలా పోటీలు.