Corona cases in India: భారత్‌లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. 24 గంటల వ్యవధిలో.. 3,06,064 కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 439 మంది మరణించారు. 2,43,495 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 20.75 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు 93.07గా నమోదైందని పేర్కొంది. యాక్టివ్ కేసుల సంఖ్య 241 రోజుల గరిష్ఠానికి చేరుకుందని వెల్లడించింది.
- మొత్తం కేసులు: 3,95,43,328
- మొత్తం మరణాలు: 4,89,848
- యాక్టివ్ కేసులు: 22,49,335
- మొత్తం కోలుకున్నవారు: 3,68,04,145
Vaccination in India
భారత్‌లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 27,56,364 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,62,26,07,516కు చేరింది.
తగ్గిన ఆర్ వ్యాల్యూ..
కరోనా వైరస్ వ్యాప్తి వేగాన్ని సూచించే ఆర్ వ్యాల్యూ జనవరి 14 నుంచి 21 మధ్య మరింత తగ్గి 1.57కు చేరినట్లు ఐఐటీ మద్రాస్ పరిశోధకులు తెలిపారు. మూడో వేవ్‌లో వైరస్ బారిన పడే వారి సంఖ్య రానున్న 14 రోజుల్లో మరింత పెరిగి.. దేశ జీవనకాల గరిష్ఠాన్ని తాకుతుందని అంచనా వేశారు. ఆర్ వ్యాల్యూ 1 కంటే తక్కువగా నమోదు అయితే వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లుగా పరిగణించాల్సి ఉంటుందని చెప్పారు. ఆర్ వ్యాల్యూ ముంబయిలో 0.67, దిల్లీలో 0.98, చెన్నైలో 1.2, కోల్‌కతాలో 0.56 గా నమోదు అయినట్లు పేర్కొన్నారు. ముంబయి, కోల్‌కతాలో ఆర్ వ్యాల్యూ ఇప్పటికే అత్యధిక స్థాయికి చేరుకుని తగ్గుముఖం పట్టినట్లు వివరించారు. దిల్లీ, చెన్నైలో ఇంకా ఒకటికి దగ్గరగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
అంతర్జాతీయంగా..
corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 21,66,916 మందికి కరోనా సోకింది. 4,627 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 35,19,19,504కి చేరగా.. మరణాల సంఖ్య 56,14,336కు పెరిగింది.
- అమెరికాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కొత్తగా 1,97,374 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. 574 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 7.1 కోట్లు దాటింది.
- ఫ్రాన్స్‌లో ఒక్కరోజే 3,01,614 కేసులు వెలుగుచూశాయి. మరో 115 మంది చనిపోయారు.
- ఇటలీలో 1,38,860 కొత్త కేసులు బయటపడగా.. 227 మంది మరణించారు.
- బ్రెజిల్లో కొత్తగా 84,230 మందికి వైరస్ సోకగా.. 166 మంది చనిపోయారు.
- జర్మనీలో 75,280 వేల మందికి వైరస్ సోకింది. మరో 31 మంది మృతి చెందారు.
- బ్రిటన్‌లో మరో 74,799 వేల మంది వైరస్ బారిన పడ్డారు. 75 మంది మృతి చెందారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: కర్ణాటకలో ఒక్కరోజే 50 వేలకుపైగా కరోనా కేసులు