కరోనా కేసులు మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8గంటల వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 6,050 కేసులు నమోదయ్యాయి. గురువారంతో పోలిస్తే.. ఏడు వందలకు పైగా కేసులు పెరిగాయి. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య కూడా 28,303 పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరోవైపు, దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయా శుక్రవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ మంత్రులతో సమావేశం కానున్నారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసులను సమీక్షించటంతో పాటు చర్యలపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు దిశానిర్దేశం చేయనున్నారు.
- దేశంలో కొత్తగా 6,050 కరోనా కేసులు నమోదయ్యాయి.
- రోజువారి పాజిటివిటీ రేటు 3.39 శాతానికి పైగా పెరిగింది. వీక్లీ పాజిటివిటీ రేటు 3.02 శాతంగా ఉంది.
- కొవిడ్ వైరస్ వల్ల మరో 14 మరణించారు.
- మహారాష్ట్ర నుంచి ముగ్గురు.. కర్ణాటక, రాజస్థాన్ నుంచి ఇద్దరు.. దిల్లీ, గుజరాత్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్, పంజాబ్ నుంచి ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
- ఇప్పటి వరకు కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 5,30,943కు చేరింది.
- దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 28,303కు చేరింది.
- కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 4,47,45,104 మందికి కొవిడ్ సోకింది.
- ఇప్పటి వరకు 4,41,85,858 రికవరి అయ్యారు. రికవరి రేట్ 98.75 శాతంగా ఉంది.
- ఇప్పటివరకు 220.66(220,66,20,700) కోట్ల కొవిడ్ టీకాలు పంపిణీ చేశారు.
- గురువారం ఒక్కరోజే 1,78,533 మందికి కొవిడ్ నిర్థరణ పరీక్షలు చేశారు.
- 203 రోజుల తర్వాత దేశంలో ఒక రోజులో ఇవే అత్యధిక కేసులు
అంతకుముందు బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 5,335 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. బుధవారం లక్షా 60 వేల(1,60,742) కొవిడ్ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు పేర్కొంది. రోజువారి పాజిటివిటీ రేటు 3.39 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దిల్లీ, మహారాష్ట్ర, కేరళ, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, హిమాచల్ వంటి రాష్ట్రాల్లో క్రియాశీల కేసులు ఎక్కువగా ఉన్నట్లు ప్రకటించింది. ప్రజలందరూ బహిరంగ ప్రదేశాల్లో కరోనా నిబంధనలను తప్పకుండా పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.