Covid Cases In India : దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 797 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. మొత్తం ఐదుగురు (కేరళ (2), మాహారాష్ట్ర (1), పుదుచ్చేరి (1), తమిళనాడు (1)) మృతిచెందారని తెలిపింది. 2023 మేలో గరిష్ఠంగా 865 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గత 225 రోజుల్లో ఇదే అత్యధికం అని చెప్పింది. ప్రస్తుతం క్రీయాశీల కేసుల సంఖ్య 4,091కి చేరిందని వెల్లడించింది.
కేంద్ర ఆరోగ్యశాఖ వెబ్‌సైట్ ప్రకారం కొవిడ్ వైరస్ బారి నుంచి 4.4 కోట్ల మంది కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల కొవిడ్ టీకాలు వేశారు. దాదాపు నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 5.3 లక్షల మంది ఈ మహమ్మారి వల్ల చనిపోయారు. అయితే ఈ ఏడాది డిసెంబరు 5 నాటికి రోజువారీ కేసుల సంఖ్య తగ్గింది. కొత్త వేరియంట్, చల్లని వాతావరణ పరిస్థితుల కారణంగా కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.
JN.1 Cases In India : మరోవైపు నవంబర్ 21 నుంచి డిసెంబర్ 18 నాటికి కలెక్ట్ చేసిన శాంపిళ్లలో డిసెంబర్ 28 నాటికి 145 జేఎన్.1 వేరియంట్ కేసులు నమోదయ్యాయి. JN.1 అనేది ఒమిక్రాన్ సబ్ వేరియంట్. దీన్ని BA.2.86 లేదా పిరోలా అని పిలుస్తారు. ఈ JN.1 వేరియంట్ మొదటి కేసు కేరళలో నమోదైంది.
7 రోజుల ఐసోలేషన్ తప్పనిసరి!
రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో పాజిటివ్ రోగులకు ఏడు రోజుల హోమ్ ఐసోలేషన్ తప్పనిసరి చేసింది కర్ణాటక ప్రభుత్వం. మంగళవారం ఒక్కరోజులోనే 74 కొత్త కేసులు నమోదైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం సమావేశమైన కర్ణాటక క్యాబినెట్ సబ్ కమిటీ, ప్రజలందరూ మాస్కులు ధరించాలని సూచించింది. కరోనా లక్షణాలు ఉన్న పిల్లలను పాఠశాలలకు పంపించరాదని చెప్పింది. కొవిడ్ కేసుల పెరుగుదల, JN.1 వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భౌతిక దూరం, ఏడు రోజుల హోమ్ ఐసోలేషన్ వంటివి పాటించాలని సూచించింది. పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.