Covid Cases in India: దేశంలో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. ఆందోళనకర స్థాయిలో కొవిడ్ కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో కొత్తగా 34,424 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. 22 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 2,21,477గా ఉంది. ముంబయిలోనే 11,647 కేసులు వెలుగు చూశాయి. మరోవైపు అదే రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,281కు చేరింది. 499 మంది ఈ వేరియంట్ నుంచి కోలుకున్నారు.
- దిల్లీలో కొత్తగా 21,259 కేసులు బయటపడ్డాయి. 23 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 74,881గా ఉంది. పాజిటివీ రేటు 25.65కు చేరింది.
- బంగాల్లో కూడా భారీగా కరోనా కేసులు వెలుగు చూశాయి. కొత్తగా 21,098 మందికి వైరస్ సోకగా.. 19 మంది మృతిచెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,02,236కు చేరగా.. పాజిటివిటీ రేటు 32.35 శాతంగా ఉంది.
- కర్ణాటకలో 14,473 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 73,260గా ఉండగా.. పాజిటివిటీ రేటు 10.30 శాతానికి చేరింది.
- ఉత్తర్‌ప్రదేశ్‌లో కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 11,089గా ఉంది. 543 మంది కోలుకోగా.. ఐదు మరణాలు నమోదయ్యాయి. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 44,466కు చేరింది.
- కేరళలో కూడా కరోనా వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 9,066 కేసులు వెలుగుచూశాయి. 2,064 మంది కోలుకోగా.. 19 మరణాలు నమోదయ్యాయి. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 44,441గా ఉండగా.. మరణాల సంఖ్య 50,053కు చేరింది.
- రాజస్థాన్‌లో 6,366 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 30,597గా ఉంది.
- హరియాణాలో 5,746 కొత్త కేసులు వెలుగు చూశాయి. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు కొత్తగా 26 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి.
- ఝార్ఖండ్‌లో కొత్తగా 4,482 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధరణ అయింది. 1,789 మంది కోలుకోగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు రాష్ట్రంలో 15-18 ఏళ్ల వారికి టీకాల పంపిణీ విస్తృతంగా జరుగుతోంది. ఇప్పటివరకు 4.11 లక్షల మంది తొలిడోసు తీసుకున్నారు.
ఆర్టీపీసీఆర్ తప్పనిసరి
మహమ్మారి ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది మేఘాలయ ప్రభుత్వం. రాష్ట్రంలోకి ప్రవేశించాలంటే ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి అని.. ఒకవేళ రాష్ట్ర సరిహద్దుల్లోని కేంద్రాల వద్ద పరీక్షలు చేయించుకుంటే ఫలితం వచ్చేవరకు ఐసోలేషన్‌లో ఉండాలని తెలిపింది. ఈ ఆంక్షలు వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది.
రూ.50కే ర్యాపిడ్ టెస్ట్
ప్రైవేటు ల్యాబ్‌లలో ర్యాపిడ్ టెస్ట్‌ల ధరను నిర్ణయించింది రాజస్థాన్ ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ల్యాబ్‌లలో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేయించుకోవాలంటే రూ.50 చెల్లిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. ర్యాపిడ్ టెస్ట్ ప్రజలు అందరికీ అందుబాటులో ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒకవేళ ఈ ధరలపై ల్యాబ్ నిర్వహకులు ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
18 లక్షలకు పైగా ప్రికాషన్ డోసులు
దేశంలో 18 లక్షలకుపైగా ప్రికాషన్ డోసులు పంపిణీ చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. వ్యాక్సినేషన్లో భాగంగా ఇప్పటివరకు 153.70 కోట్ల డోసులను అందించినట్లు తెలిపింది. మంగళవారం ఒక్కరోజే 76 లక్షల డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది.
ఇదీ చూడండి : ప్రైవేటు ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రం హోమ్... వారికి నష్టమే!