ఒకవైపు కరోనా విజృంభణ.. మరోవైపు వ్యాక్సిన్ల కొరత వేధిస్తున్న నేపథ్యంలో విదేశాల్లో అనుమతులు పొందిన పలు టీకాలకు దేశంలో అత్యవసర వినియోగానికి అనుతిచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇప్పటికే దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను వినియోగిస్తుండగా.. ఇటీవలే స్పుత్నిక్-వి వాక్సిన్‌కూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది భారత భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ). ఈ తరహాలోనే మరికొన్ని వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం చూస్తోంది. త్వరలో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉన్న టీకాలు.. వాటి సామర్థ్యాన్ని ఓసారి పరిశీలిద్దాం.
మోడెర్నా: టీకా సామర్థ్యం 94.1 శాతం
అమెరికాలోని మోడెర్నా సంస్థకు చెందిన ఎంఆర్‌ఎన్‌ఏ టీకా సామర్థ్యం 94.1 శాతం ఉన్నట్లు పరిశోధనలో తేలింది. అమెరికా, బ్రిటన్‌తోపాటు పలు దేశాల్లో ప్రస్తుతం దీనిని వినియోగిస్తున్నారు.
28 రోజుల వ్యవధిలో రెండు మోతాదులుగా వేసుకునే అవకాశం ఉన్న ఈ వ్యాక్సిన్‌ను 2-8 డిగ్రీల సెల్సియస్ వద్ద 30 రోజుల వరకు నిల్వ చేయవచ్చు. మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ వద్ద ఆరు నెలల వరకు నిల్వ చేయవచ్చు. ఈ టీకాను వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఫైజర్: సామర్థ్యం 94 శాతం
మోడెర్నా టీకా మాదిరిగానే అమెరికాలో ఫైజర్ టీకా అందుబాటులో ఉంది. అమెరికాకు చెందిన ఫైజర్, బయోఎన్‌టెక్ సంస్థలు సంయుక్తంగా దీనిని అభివృద్ధి చేశాయి. ఈ టీకా సామర్థ్యం 94 శాతమని తయారీదారులు ప్రకటించారు. మూడు వారాల వ్యవధిలో రెండు డోసులు తీసుకోవడం వల్ల పూర్తిస్థాయి సామర్థ్యాన్ని పొందవచ్చు. ఫైజర్ వ్యాక్సిన్‌ను అవసరాన్ని బట్టి మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు.
చిన్నపిల్లలపైనా ఇటీవలే ట్రయల్స్ నిర్వహించి.. ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు ప్రకటించింది ఫైజర్.
జాన్సన్ అండ్ జాన్సన్..
అమెరికాతో పాటు ఇతర దేశాల్లో అత్యవసర వినియోగం కింద జాన్సన్ అండ్ జాన్సన్ టీకా ఆమోదం పొందింది. ఇది సింగిల్ డోసు టీకా. ప్రపంచ వ్యాప్తంగా ఈ టీకా సామర్థ్యం 66 శాతం కాగా.. అమెరికాలో 72 శాతం అని పరిశోధనలో తేలింది. ఈ వ్యాక్సిన్‌ను 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ వద్ద మూడు నెలల వరకు.. మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ వద్ద రెండు సంవత్సరాల వరకు నిల్వ చేయవచ్చు.
భారత్‌లో టీకా అత్యవసర వినియోగానికి జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది.
ఆమోదం పొందిన టీకాలు
- కొవిషీల్డ్: 90శాతం సామర్థ్యం
ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసిన టీకా కొవిషీల్డ్. కరోనా వైరస్ ప్రోటీన్‌కు అడినోవైరస్‌ను జత చేసి ఈ టీకాను తయారు చేశారు. అడినోవైరస్ అనేది సాధారణంగా ఫ్లూ, జలుబుకు కారణమయ్యే వైరస్. చింపాంజీలలో ఉండే సీహెచ్ఏడీఎస్ఎస్1 అనే వైరస్‌ను ఇందులో ఉపయోగించారు.
నాలుగు వారాల వ్యవధిలో ఇది రెండు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ టీకా మొదటి డోసు తర్వాత 70 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని సీరం ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. రెండో తీసుకున్న తర్వాత పూర్తిస్థాయిలో 90శాతం సామర్థ్యంతో ఇది పని చేస్తుందని వెల్లడించింది. 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ దీన్ని నిల్వ చేయవచ్చు.
- కొవాగ్జిన్: సామర్థ్యం 81శాతం
భారతీయ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ తయారు చేసిన టీకా కొవాగ్జిన్. రోగ నిరోధకశక్తిని పెంపొందించడమే కాకుండా వైరస్‌ను నిర్వీర్యం చేయడంలో ఇది బాగా పని చేస్తుందని పరిశోధనలో తేలింది.
నాలుగు వారాల వ్యవధిలో ఈ టీకా రెండు డోసులు తీసుకోవచ్చు. వ్యాక్సిన్‌ను 2నుంచి 8 డిగ్రీల సెల్సియస్ మధ్య నిల్వ చేయవచ్చు. దీని సామర్థ్యం 81 శాతం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి.
- స్పుత్నిక్ వి: సామర్థ్యం 92శాతం
రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్ అభివృద్ధి చేసిన టీకా స్పుత్నిక్ వి. దీనికి ఇటీవలే భారత్ అనుమతి లభించింది. దేశంలో వినియోగించేందుకు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌తో ఆర్‌డీఐఎఫ్ ఒప్పందం కుదుర్చుకుంది. స్పుత్నిక్ వి టీకా సామర్థ్య 92శాతంగా పరిశోధనలో తేలింది. ఇది మూడు వారాల వ్యవధిలో రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది.