కరోనా వ్యాక్సిన్.. ఈ ఏడాది చివరిలోగా బహిరంగ మార్కెట్లలోకి వచ్చే అవకాశముందని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) డెరెక్టర్ డా.రణ్‌దీప్ గులేరియా అన్నారు. డిమాండ్‌కు తగినట్టు వ్యాక్సిన్ సరఫరా అయినప్పుడే ఇది సాధ్యపడుతుందని ఆయన చెప్పారు. బుధవారం కొవిడ్-19 రెండో డోసు తీసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు.
దేశంలో కరోనా టీకా డ్రైవ్ ప్రారంభమైన రోజు(జనవరి 16న) తొలి డోసు తీసుకున్నారు గులేరియా. గత 28రోజుల(టీకా వ్యవధి) అనుభవాన్ని ఇలా పంచుకున్నారాయన.
"నేడు నేను కొవిడ్ రెండో డోసు టీకా తీసుకున్నాను. తొలి మోతాదు తీసున్నప్పటి నుంచి ఇప్పటివరకు నాకు ఎలాంటి దుష్ప్రభావం కనిపించలేదు. టీకా పూర్తి సురక్షితం కాబట్టి ఈ విషయంలో ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. వ్యాక్సిన్ తీసుకోని వారు బహిరంగంగా తీసుకోవాలి. వైరస్ నుంచి బయటపడాలంటే ఇది చాలా కీలకం."
- రణ్‌దీప్ గులేరియా, ఎయిమ్స్ డైరెక్టర్
కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా అంతం కాలేదన్న గులేరియా.. ప్రస్తుతానికి మన దేశం మంచి స్థితిలోనే ఉందన్నారు. అయితే.. పరిస్థితులు ఎప్పుడైనా మారవచ్చు కనుక సందిగ్ధతను వీడి వ్యాక్సిన్ వేయించుకోవడం ఉత్తమం అని సూచించారు.
ఇదీ చదవండి: 'కరోనాపై అతి విశ్వాసంతో కేంద్రం'