కరోనా సమయంలో తల్లిదండ్రులు, లేదా ఇద్దరిలో ఒకరిని కోల్పోయిన చిన్నారుల(covid orphans india) పరిస్థితిపై సుప్రీంకోర్టు(supreme court of india) తీవ్ర విచారం వ్యక్తం చేసింది. అనాథలైన చిన్నారుల మనుగడ ప్రమాదంలో పడటం చూసి హృదయం ముక్కలవుతోందని వ్యాఖ్యానించింది. అయితే వీరిని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన పథకాలపై అత్యున్నత ధర్మాసనం సంతృప్తి వ్యక్తం చేసింది.
కష్టాల్లో ఉన్న పిల్లలకు ప్రభుత్వం అండగా నిలవడం సంతోషంగా ఉందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. చిన్నారులకు అవసరమైన సాయం అందించేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ ప్రభుత్వం విడిచిపెట్టదని భావిస్తున్నట్లు తెలిపింది. కరోనా వల్ల అనాథలైన పిల్లల అంశాన్ని సుమోటోగా స్వీకరించి. విచారణ చేపట్టిన సందర్భంగా జస్టిస్ ఎల్ నాగేశ్వర్ రావు, జస్టిస్ అనిరుద్ధ బోస్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. పిల్లలందరూ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య పొందడం రాజ్యాంగపరమైన హక్కు అని, పిల్లలకు విద్యను సులభతరం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.
వారి సంరక్షణ కేంద్రానిదే
విచారణకు కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి.. చిన్నారుల సంరక్షణకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరించారు. సుమారు 2600 మంది చిన్నారులు పీఎం కేర్స్ ఫర్ చిల్ట్రన్ పథకం(pm cares for children’ scheme) కింద అర్హులుగా తేలినట్లు సుప్రీంకోర్టుకు తెలిపారు. 2600 మంది చిన్నారుల సంరక్షణను కేంద్రమే చూసుకుంటోందని స్పష్టం చేశారు. 418 దరఖాస్తులను జిల్లా మేజిస్ట్రేట్లు ఆమోదించారని చెప్పారు.
కరోనా కారణంగా సుమారు 8,161 మంది చిన్నారులు అనాథలైనట్లు బాల్ స్వరాజ్ పోర్టల్ గణాంకాలు చెబుతున్నాయి. 92,475 మంది చిన్నారులు తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఊరిపై విరుచుకుపడ్డ కొండ- ముగ్గురు పిల్లలు మృతి