దేశరాజధాని దిల్లీలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వీటితో పాటే పాజిటివిటీ రేటు కూడా తగ్గింది. నగరంలో కొవిడ్ పరిస్థితులు అదుపులోకి వచ్చినట్లు భావిస్తున్నప్పటికీ.. కేజ్రీవాల్ సర్కార్ లాక్డౌన్ను పొడిగించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. అక్కడ నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని లాక్డౌన్ను మరో వారం పాటు పొడిగించవచ్చని పేర్కొన్నాయి.
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏప్రిల్ 19న దిల్లీలో లాక్డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి వరుసగా పలుమార్లు పొడిగిస్తూ వచ్చారు. చివరగా మే16 న లాక్డౌన్ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.
శనివారం కొత్తగా 2,200 కొత్తకేసులు వెలుగు చూసినట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. అదే సమయంలో పాజిటివిటీ రేటు 3.5 శాతానికి తగ్గినట్లు పేర్కొన్నారు. కేసులు తగ్గుముఖం పట్టినంత మాత్రాన వైరస్ బలహీనపడినట్లు కాదని వెల్లడించారు. వైరస్ నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: 'దేశంలో తగ్గిన కరోనా పాజిటివిటీ రేటు'