Covid 19 Cases In India : దేశంలో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 628 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4,054కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆదివారం కేరళకు చెందిన ఓ వ్యక్తి మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 5,33,334కు చేరింది. ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,50,09,248కు పెరిగిందని తెలిపింది. కేరళలో ఒక్క రోజులో 128 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 3,128కు చేరింది. తాజా మరణంతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 72,064 మంది చనిపోయినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
63కు చేరిన ఉపరకం జేఎన్ 1 కేసులు
మరోవైపు కొవిడ్ ఉపరకం జేఎన్ 1 కేసులు ఆదివారం నాటికి 63కు చేరుకున్నాయి. ఇందులో గోవాలో అత్యధికంగా 34 కేసులు, మహారాష్ట్రలో 9, కర్ణాటకలో 8, కేరళలో 6, తమిళనాడులో రెండు, తెలంగాణలో రెండు చొప్పున నమోదయ్యాయి. మహారాష్ట్రలో కొత్తగా 50 కొవిడ్ కేసులు రాగా, అందులో కొవిడ్ ఉపరకం జేఎన్ 1 కేసులు 9 వెలుగు చూసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా నమోదైన తొమ్మిది జేఎన్.1 రకం కేసులతో కలుపుకుంటే కొత్త ఉపరకం కేసుల సంఖ్య 10కి చేరినట్లు వివరించింది. కొత్త వేరియంట్‌లో సోకిన వారిలో ఠాణేలో ఐదుగురు, పుణె నగరంలో ఇద్దరు కాగా.. పుణె జిల్లాలో ఒకరు, అకోలా సిటీలో ఒకరిలో జేఎన్.1 వేరియంట్ గుర్తించినట్లు తెలిపింది. అయితే, జేఎన్.1 వేరియంట్ సోకిన అందరూ కోలుకుంటున్నట్లు చెప్పింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మూడేళ్ల క్రితం నుంచి ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 81,72,135కు చేరింది.
జేఎన్ 1 కేసుల పెరుగదులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ చెప్పారు. ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేశామని, పరీక్షలను పెంచామని తెలిపారు. దేశంలో కేసులు పెరిగినప్పటికీ, అందులో 92 శాతం మంది రోగులు ఇంట్లోనే చికిత్స పొందుతున్నట్లు వివరించారు. ఆస్పత్రిలో చేరేవారి సంఖ్యలో పెరుగుదల లేదని, చేరిన వారంతా ఇతర ఆరోగ్య సమస్యలతో వచ్చినవారేనని చెప్పారు.
'కరోనా కొత్త వేరియంట్‌తో భయం లేదు- వ్యాక్సిన్ ఎక్స్ట్రా డోస్ కూడా!'
కేరళలో భారీగా కొత్త కరోనా కేసులు- అధికారులతో ఆరోగ్య మంత్రి రివ్యూ