ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ తదితర వృత్తి విద్య కోర్సులకు సంబంధించిన పుస్తకాలు, వీడియోలు ఆంగ్లంలో ఉండేవి. వాటిని అర్థం చేసుకోవడానికి కొందరు ఇబ్బందులు పడేవారు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న కేంద్ర విద్యా శాఖ ఆన్‌లైన్ కోర్సులను ప్రాంతీయ భాషలోకి అందుబాటులోకి తీసుకొచ్చి, ఆయా భాషల్లోని పుస్తకాలను www.swayam.gov.in వెబ్‌సైట్‌లో (swayam regestration in 2021) పొందుపరిచింది. తెలుగులోనూ ఐఐటీ, ఐఐఎం, కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఆచార్యులు బోధించే పాఠాల సారాంశాలను చదువుకోవచ్చు.. వినొచ్చు. ఆంగ్లంలో ఉన్న ఆన్‌లైన్ కోర్సుల పాఠ్యాంశాలను హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, మలయాళం, తమిళ భాషల్లోనూ అనువదించి అందుబాటులో తీసుకొచ్చారు. మరిన్ని కోర్సులనూ వెబ్‌సైట్‌లో పొందుపరిచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఏమిటీ స్వయం?
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో విభిన్న కోర్సులు పూర్తి చేసేందుకు, ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను (swayam online courses) పెంపొందించడానికి కేంద్ర విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చిన వేదికే 'స్వయం'. ప్రతిష్ఠాత్మక ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు రూపొందించిన కోర్సులను ఆ వెబ్‌సైట్లో పొందుపరుచుతున్నారు. ఆన్‌లైన్ కోర్సులను ఉచితంగా అందించేందుకు 2017, జులైలో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వయం పోర్టల్‌ను ఆవిష్కరించారు. అందులో ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ, న్యాయవిద్య తదితర వృత్తి విద్యా కోర్సులతోపాటు సంప్రదాయ డిగ్రీ విద్యార్థులకు ఉపయుక్తమైన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆ పోర్టల్‌లో పేర్ల నమోదుకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ, దివ్యాంగులు, మహిళలు రూ.500, ఇతరులు రూ.వెయ్యి పరీక్ష రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఉత్తీర్ణత (40 శాతం మార్కులు) సాధించిన తర్వాత ధ్రువపత్రం అవసరం అనుకుంటే కొంత రుసుం చెల్లించాలి. ఉత్తీర్ణులైన వారికి రుసుం తిరిగి ఇస్తారు. ప్రస్తుతం ఎనిమిది ప్రాంతీయ భాషల్లో 268 రకాల ఆన్‌లైన్ కోర్సులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. తెలుగు కోర్సులు 61. ప్రస్తుతానికి వీడియో పాఠాలు ఆంగ్లంలోనే ఉన్నా అందులోని సారాంశాన్ని ఆయా భాషల్లో చదువుకోవచ్చు.. వినొచ్చు.
రెండు మూడేళ్లలో పూర్తిస్థాయిలో..
ఆన్‌లైన్ కోర్సులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించే ప్రక్రియలో ఐఐటీ హైదరాబాద్ క్రియాశీలకంగా పాలుపంచుకుంటోంది. మరో రెండు మూడేళ్లలో ప్రాంతీయ భాషల్లోని అన్ని కోర్సులు పూర్తిస్థాయిలో అందుబాటులో వస్తాయి. చైనా తరహాలో ఇక్కడ కూడా అన్ని భాషల్లో వృత్తి విద్య కోర్సులు రావాల్సిన అవసరం ఉంది.
- ఆచార్య బీ.ఎస్.మూర్తి, సంచాలకుడు, ఐఐటీ, హైదరాబాద్
ఇవీ వివరాలు
- ప్రస్తుతం అందుబాటులో ఉన్న మొత్తం కోర్సులు: 2,448
- ప్రాంతీయ భాషల్లో ఉన్న కోర్సులు: 268
- మొత్తం కోర్సుల్లో పేర్లు నమోదు చేసుకున్న విద్యార్థులు: 76 లక్షలు
- కోర్సుల కాల వ్యవధి: 4 నుంచి 24 వారాలు
- ఎవరికి ఉపయోగం: 9వ తరగతి నుంచి పీజీ విద్యార్థులు
- అర్హత: విద్యార్హతతో సంబంధం లేదు
ఇదీ చదవండి:'సైన్యంలో మహిళా అధికారులకు 10 రోజుల్లో శాశ్వత కమిషన్'