రాజ్యాంగం ప్రవచించిన సమ్మిళిత ఆదర్శాన్ని చేరుకోవాలంటే భారత న్యాయవ్యవస్థలో మహిళా జడ్జీల ప్రాతినిధ్యం పెరగాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆకాంక్షించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు, హైకోర్టులలో కలిపి వీరి ప్రాతినిధ్యం 12శాతం కన్నా తక్కువగా ఉందని తెలిపారు. స్వల్ప ఖర్చుతో అందరికీ న్యాయం అందేలా చూడాలని, సాధారణ ప్రజలు అర్థం చేసుకొనే భాషలో తీర్పులు వెలువరించాలని సూచించారు. ఆయన శనివారం ప్రయాగ్‌రాజ్‌లో (అలహాబాద్) ఉత్తర్‌ప్రదేశ్ జాతీయ న్యాయవిశ్వవిద్యాలయం, అలహాబాద్ హైకోర్టు ప్రాంగణంలో కొత్త భవన సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు.
"దేశంలో అతిపెద్దదైన అలహాబాద్ హైకోర్టుకు ఎంతో చరిత్ర ఉంది. దేశంలో తొలి మహిళా న్యాయవాది కార్నెలియా సొరాబ్జీ 1921లో ఇక్కడే నమోదయ్యారు. మహిళా సాధికారత దిశలో ఈ హైకోర్టు ఎన్నో నిర్ణయాలు తీసుకొంది. చరిత్రలో ఇదివరకు ఎన్నడూలేని విధంగా గత నెలలో సర్వోన్నత న్యాయవ్యవస్థలో మహిళలకు అత్యధిక ప్రాతినిధ్యం కల్పించాం. సుప్రీంకోర్టుకు నియమించిన తొమ్మిది మంది కొత్త న్యాయమూర్తుల్లో ముగ్గురు అతివలకు అవకాశం కల్పించాం. వీరిలో ఒకరు భవిష్యత్తులో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అయ్యే వీలుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సేవలందిస్తున్న 33 మంది న్యాయమూర్తుల్లో నలుగురు వారే ఉండటం చరిత్రలో ఇదే తొలిసారి. అన్ని రంగాల్లో మహిళా భాగస్వామ్యం పెరిగినప్పుడే న్యాయబద్ధమైన సమాజం ఏర్పాటు సాధ్యమవుతుంది."
-రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి
"న్యాయం పొందడానికి పేదలు పడే కష్టాలను నేను చాలా దగ్గరి నుంచి చూశాను. తక్కువ ఖర్చుతో పేదలు సకాలంలో న్యాయం పొందేలా చూడాలి. సాధారణ ప్రజలు అర్థం చేసుకొనే భాషలో నిర్ణయాలు వెలువరించాలి. మరీ ముఖ్యంగా బలహీనవర్గాలు, మహిళలకు సత్వర న్యాయం చేయాలి" అని రామ్‌నాథ్ సూచించారు.
త్వరలో మధ్యవర్తిత్వ న్యాయ బిల్లు
వచ్చే శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో మధ్యవర్తిత్వ న్యాయ బిల్లును ప్రవేశపెడతామని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ విక్రమ్‌నాథ్, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మునీశ్వర్‌నాథ్ భండారీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.
'శిథిల భవనాల్లో న్యాయస్థానాలు'
దేశంలో సామాన్యులకు వేగంగా న్యాయం అందించడం కోసమే తాను.. జాతీయ మౌలిక వసతుల సంస్థ (నేషనల్ జ్యుడీషియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) ఏర్పాటుపై ప్రధానంగా డిమాండ్ చేస్తున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ తెలిపారు. ఇప్పటికీ దేశంలో ఎన్నో కోర్టులు శిథిలావస్థకు చేరిన భవనాల్లో కొనసాగుతున్నాయని.. దానివల్ల సిబ్బంది, న్యాయమూర్తులు పూర్తి స్థాయిలో పని చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దానివల్ల సత్వరం న్యాయం అందించలేని పరిస్థితి ఉందన్నారు. అలహాబాద్ హైకోర్టు ప్రాంగణంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరణ్ తండ్రి, ప్రఖ్యాత న్యాయకోవిదుడు అనంద్‌భూషణ్ శరణ్ తైల వర్ణ చిత్రాన్ని ఆవిష్కరించిన అనంతరం జస్టిస్ ఎన్.వి. రమణ మాట్లాడారు.
"150 ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న అలహాబాద్ హైకోర్ట ఎంతోమంది ప్రఖ్యాత న్యాయకోవిదులను దేశానికి అందించింది. ఎన్నో చరిత్రాత్మక తీర్పులకు వేదికగా నిలిచింది. 1915లో ఇందిరా గాంధీని అనర్హరాలిగా ప్రకటిస్తూ ఈ హైకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పు దేశాన్ని కుదిపేసింది. జాతీయ స్వాతంత్ర్య పోరాటం, భారత రాజ్యాంగ రచనలో ఈ బార్ అసోసియేషన్ చెరగని ముద్ర వేసింది. ఆ సమున్నత వారసత్వాన్ని, సంప్రదాయాలను, చారిత్రాత్మక సంస్కృతిని ఇక ముందు కూడా కొనసాగించాలి."
-జస్టిస్ ఎన్.వి. రమణ, భారత ప్రధాన న్యాయమూర్తి
'విస్మరించడానికి వీల్లేదు'
దేశంలో న్యాయవ్యవస్థకు అవసరమైన మౌలిక వసతులను బలో పేతం చేయాలన్న విషయాన్ని విస్మరించడానికి వీల్లేదన్నారు జస్టిస్ ఎన్.వి రమణ. బ్రిటీష్‌వారు దేశాన్ని వదిలిపెట్టిపోయిన తర్వాత న్యాయవ్యవస్థకు మౌలిక వసతుల కల్పన అంశాన్ని నిర్లక్ష్యం చేశామని వ్యాఖ్యానించారు. నేషనల్ జ్యూడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా నేషనల్ కోర్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు రూపుదిద్దుకొని పరిస్థితులను మెరుగు పరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజిక బాధ్యత, సమ్మిళిత నిర్మాణమే జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మూల సిద్ధాంతం అని వివరించారు.
ఇదీ చూడండి : అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా భాజపా 'బూత్ విజయ్ అభియాన్'