Corona Wedding Invitation Card: దేశంలో కరోనా మూడో దశ ప్రారంభమైంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రతి ఒక్కరు టీకా తప్పని సరిగా వేసుకోవాలని సూచిస్తున్నాయి. వివాహాది కార్యక్రమాలు పరిమిత సంఖ్యలో జరుపుకోవాలనే నిబంధనలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర జలగావ్ జిల్లాలోని ఓ వివాహ ఆహ్వాన పత్రిక అందరి దృష్టిని ఆకర్షిచింది. వెడ్డింగ్ కార్డ్‌పై ఓ పేజీ మొత్తం కరోనా నిబంధనలను సూచిస్తూ ప్రచురించారు. పెళ్లికి వచ్చే అతిథులు వ్యాక్సినేషన్ వేసుకోవడమే తమకు ఇచ్చే కానుకగా పేర్కొన్నారు.
![unique wedding card story](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/jalgaonwhatcoronaanokhilagnapatrika_11012022150533_1101f_1641893733_1101.jpg)
Funny Covid Wedding Invitations: జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టు అనిల్ కెర్హలే తమ కూతురు నికితా కేర్హలేకు త్వరలో పెళ్లి చేస్తున్నారు. నికిత కూడా మీడియాలోనే ఉద్యోగం చేస్తున్నారు. చేతన్ అనే వరుడితో ఫిబ్రవరి 5న ఆమె పెళ్లికి ముహూర్తం నిశ్చయమైంది. కానీ అనూహ్యంగా వారి జిల్లాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. దీంతో కఠిన నిబంధనలను విధించారు జిల్లా కలెక్టర్. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అనిల్ కెర్హలే ఓ ప్రత్యేకమైన వెడ్డింగ్ కార్డ్‌ను తయారు చేయించారు. పేజీ పైభాగంలో భౌతిక దూరం, శానిటైజేషన్ ప్రాముఖ్యాన్ని బొమ్మలతో సూచించారు. పైభాగంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గుర్తును ముద్రించారు. అతిథులను ఉద్దేశిస్తూ..'మీ వ్యాక్సినేషన్ మా పెళ్లి కానుక' అని రాశారు. కింది భాగంలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రంతో కూడిన వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ గుర్తును వేశారు. వెడ్డింగ్ కార్డ్ మరో పేజీని వధూవరుల పేర్లు, వేడుక జరిగే ప్రదేశం సహా ఇతర వివరాలకు కేటాయించారు. ఈ పత్రికను జిల్లా కలెక్టర్ అభిషేక్ రౌత్‌కు అందించి పెళ్లికి ఆహ్వానించారు. కరోనా పరిస్థితుల్లో అనిల్ కెర్హలే అనుసరించిన ఈ విధానాన్ని కలెక్టర్ ప్రశంసించారు.
![unique wedding card](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/jalgaonwhatcoronaanokhilagnapatrika_11012022150533_1101f_1641893733_284.jpg)
ఇదీ చదవండి: 'ఒమిక్రాన్‌ను సాధారణ జలుబుగా భావించవద్దు'