Corona vaccine miracle: ఝార్ఖండ్ బోకారో జిల్లా ఉతాసారా పంచాయతీ పరిధిలోని సల్గాడీహ్ గ్రామంలో అనూహ్య సంఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఐదేళ్లుగా మంచానికే పరిమితిమైన 55 ఏళ్ల వ్యక్తి.. కొవిషీల్డ్ టీకా తొలి డోసు తీసుకున్న తర్వాత లేచి నిలబడ్డాడు. అంతేకాదు అప్పటివరకు మాట్లాడలేకపోయిన అతడు టీకా వేసుకున్నాక గలగలా మాట్లాడుతున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. ఒక్కరోజులో అద్భుతం జరిగిందా? అని ఆశ్చర్యపోయారు. వెంటనే ఈ విషయంపై అధికారులకు సమాచారం ఇచ్చారు. దీనిపై దార్యప్తు జరిపేందుకు ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది.
Bokaro man vaccine
అతని పేరు పేరు దులార్‌చంద్ ముండా. ఐదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. వెన్నెముక దెబ్బతిని మంచానికే పరిమితం అయ్యాడు. మాట కూడా పడిపోయింది. అటు ఇటు కదలడానికి కూడా కుటుంబసభ్యుల సహాయం కావాల్సి ఉండేది. ఇలాంటి పరిస్థితిలో ఉండగా.. అంగన్వాడీ కార్యకర్త అతనికి జనవరి 4న కొవిషీల్డ్ టీకా తొలిడోసు వేసింది. ఆ మరునాడు జరిగిన అద్భుతం చూసి షాక్‌కు గురికావడం కుటుంబసభ్యుల వంతు అయింది. అతడు లేచి నిలబడటమే గాక, మాట్లాడటం మొదలుపెట్టాడు.
అతని రిపోర్టులు పరిశీలించామని, ఇది విచారణ జరిపాల్సిన విషయమని వైద్యులు తెలిపారు. ఇది ఆశ్చర్యకరమైన, అరుదైన ఘటన అని పేర్కొన్నారు.
అయితే గ్రామస్థులు మాత్రం దైవ సంబంధ కారణంతోనే ఈ అద్భుతం జరిగిందని భావిస్తున్నారు. లేకపోతే ఐదేళ్లు మంచానికే పరిమితమైన వ్యక్తికి ఇలా ఎలా సాధ్యమవుతుందని మాట్లాడుకుంటున్నారు.
ఇదీ చదవండి: అయోధ్య రామాలయ నిర్మాణం- 3డీ యానిమేషన్లో..