కొవిడ్-19 నియంత్రణకు సీరం సంస్థ తయారుచేస్తున్న 'కొవిషీల్డ్' టీకా అత్యవసర వినియోగానికి కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) నేతృత్వంలోని నిపుణుల కమిటీ శుక్రవారం ఆమోదముద్ర వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీకా అత్యవసర వినియోగం కోసం సీరం సంస్థ, భారత్ బయోటెక్, ఫైజర్ సంస్థలు చేసుకున్న దరఖాస్తులపై నిపుణుల కమిటీ డిసెంబర్ 9, 30 తేదీల్లో సమావేశమై చర్చించింది. వారి నుంచి అదనపు సమాచారం కోరింది.
సీరం సంస్థ.. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ సౌజన్యంతో టీకా ఉత్పత్తి చేస్తోంది. ఆ వర్సిటీ రూపొందించిన టీకాకు బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను సమర్పించాలని నిపుణుల కమిటీ ఆ సంస్థకు సూచించింది. డిసెంబర్ 30న బ్రిటన్ ప్రభుత్వంలోని ఔషధాలు, ఆరోగ్య పరిరక్షణ ఉత్పత్తుల నియంత్రణ సంస్థకు చెందిన నిపుణుల కమిటీ ఆ టీకాకు ఆమోదముద్ర వేసింది. టీకా నిర్దేశిత ప్రమాణాలు, భద్రత, నాణ్యత, సామర్థ్యానికి అనుగుణంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇప్పుడు ఆ అనుమతులను సీరం సంస్థ భారత నిపుణుల కమిటీకి సమర్పించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దాని అత్యవసర వినియోగానికి శుక్రవారం అనుమతి ఇవ్వడానికి 90% అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.