Converted Christian Caste Case : దళిత క్రైస్తవులు ఎస్సీ జాబితాలో కొనసాగాలని ఎప్పటినుంచో డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్న వారిని ఎస్సీ జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఇలాంటి ఓ అంశంపై దాఖలైన పిటిషన్‌పై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంట్లో ఏసుక్రీస్తు ఫొటో పెట్టుకున్నంత మాత్రాన ఆ కుటుంబం మతం మారినట్లు కాదని.. ఈ కారణంతో వారిని ఎస్సీ కేటగిరీ నుంచి ఎలా తీసేసారని నాగ్‌పుర్ డివిజన్ బెంచ్ ప్రశ్నించింది. వారిని ఎస్సీ కేటగిరీ నుంచి తొలగిస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది. రెండు వారాల్లో పిటిషనర్‌కు చెల్లుబాటయ్యే కుల ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయాలని ఆదేశించింది. తనను ఎస్సీ నుంచి ఓబీసీ కేటగిరీలోకి మారుస్తూ జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఓ 17 ఏళ్ల అమ్మాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.
ఇంట్లో ఫొటో చూసి..
Converted Christian Category : మహారాష్ట్ర.. అమరావతి జిల్లాకు చెందిన 17 ఏళ్ల ఓ అమ్మాయికి కుల ధ్రువీకరణ పత్రం అవసరం వచ్చి.. దాని కోసం దరఖాస్తు చేసింది. అనంతరం జిల్లా కుల ధృవీకరణ పత్రాల పరిశీలన కమిటీ సభ్యులు విచారణ నిమిత్తం సదరు అమ్మాయి ఇంటికి వచ్చారు. ఇంట్లో ఏసుక్రీస్తు ఫొటోలు చూసి.. అమ్మాయి తండ్రి, తాత క్రైస్తవ మతంలోకి మారారని భావించారు. ఇక క్రైస్తవంలోకి ఆ అమ్మాయి తండ్రి, తాత మారారు కాబట్టి.. ఎస్సీ (మహర్) కేటగిరీ నుంచి తీసేసి ఓబీసీ కేటగిరీలో చేర్చి 2022 సెప్టెంబర్‌లో ఆదేశాలు జారీ చేశారు. దీంతో విజిలెన్స్ కమిటీ ఇచ్చిన ఆదేశాలను ఆ యువతి బాంబే హైకోర్టులో సవాల్ చేసింది. అక్టోబర్ 10న సవాల్ పటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.
అయితే ఆ ఏసుక్రీస్తు ఫొటోను ఎవరో తమకు కానుకగా ఇచ్చారని.. అందుకే దాన్ని ఇంట్లో పెట్టుకున్నామని కోర్టుకు అమ్మాయి తెలియజేసింది. తాను 'మహర్' కులానికి చెందిన వ్యక్తిననే వాదనను బలపర్చడానికి.. 1950 షెడ్యూల్డ్ కులాల జాబితాలో మహర్ కులం ఉందనే డాక్యుమెంట్లను కూడా కోర్టుకు సమర్పించింది. ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ పృథ్విరాజ్ చవాన్, జస్టిస్ ఊర్మిళ జోషి ఫాల్కేతో కూడిన డివిజన్ బెంచ్.. పిటిషనర్ కుటుంబం బౌద్ధమతం అనుసరిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తున్నందున.. విజిలెన్స్ కమిటీ నివేదికను విస్మరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
'అమ్మాయి తండ్రి లేదా తాత మతం మారారన్న విజిలెన్స్ కమిటీ అభిప్రాయానికి.. వారి విచారణలో ఎలాంటి ఆధారం లభించలేదు. ఇంట్లో ఫొటో పెట్టుకున్నంత మాత్రాన వారు మతం మారినట్లు మానసికంగా బాగున్న ఏ వ్యక్తీ అంగీకరించలేడు. కానీ విజిలెన్స్ అధికారి పిటిషనర్ ఇంటికి విచారణకు వెళ్లినప్పుడు.. ఇంట్లో ఏసుక్రీస్తు ఫొటోను చూసి వారు మతం మారారని భావించారు. విచారణ సమయంలో అమ్మాయి చూపించిన పూర్వ-రాజ్యాంగ పత్రాన్ని ప్రాధాన్యం లేనిదిగా భావించారు. దీంతో పాటు పిటిషనర్ తన తండ్రి, తాత ఇతర కుటుంబ సభ్యులకు జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రాలు అధికారులకు చూపించింది. అలాంటి స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడు.. వాటి కంటే అధికారులకు ఇంకా ఏం కావాలి?' అని డివిజన్ బెంజ్ వ్యాఖ్యానించింది.