వ్యవసాయం, రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గత ఐదేళ్లలో రైతు సమస్యలకు సమగ్ర, పారదర్శక పరిష్కారం చూపడంలో ప్రధాన్‌మంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై) పథకం ఉదాహరణగా నిలిచిందని తెలిపారు. ఈ పథకం ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్తరాఖండ్‌కు చెందిన 'ఖీమానంద్ పాండే' అనే రైతు.. మోదీని అభినందిస్తూ లేఖ రాశారు. సదరు రైతు లేఖకు జవాబిచ్చిన మోదీ పై విధంగా స్పందించారు.
వాతావరణ పరిస్థితుల కారణంగా నిరంతంరం సవాళ్లు ఎదుర్కొంటున్న రైతులకు పీఎంఎఫ్‌బీవై పథకం అండగా నిలుస్తోందని ఉత్తరాఖండ్ నైనితాల్‌కు చెెందిన రైతు తెలిపాడు.
సేవచేసేందుకు శక్తి..
రైతు లేఖకు స్పందించిన ప్రధాని.. దేశవ్యాప్తంగా కోట్లాది రైతులు పీఎంఎఫ్‌బీవై ప్రయోజనాలు పొందుతున్నారని తెలిపారు. స్నేహపూర్వకమైన బీమా పథకంగా వారికి తోడ్పాటును అందిస్తోందని వివరించారు. 'విత్తనం నుంచి మార్కెట్' వరకు రైతులకు గల ప్రతి అడ్డంకులను తొలగించి.. వారి శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడుతున్నట్లు వెల్లడించారు. సంపన్న, స్వావలంబన కలిగిన భారతదేశాన్ని నిర్మించేందుకు వేగంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి సందేశాలు మరింత సేవ చేసేందుకు కొత్త శక్తిని ఇస్తాయని ప్రధాని లేఖలో పేర్కొన్నారు.
'నమో యాప్' ద్వారా ఈ లేఖ రాసినట్లు రైతు వివరించారు. ప్రధాని నుంచి సమాధానం రావడం నమ్మశక్యంగా లేదని.. చాలా ఆనందంగా ఉందని తెలిపాడు.
ఇదీ చదవండి: 'కాంగ్రెస్‌లో నాయకత్వమే కాదు సరైన విధానాలూ లేవు'