నందిగ్రామ్ నుంచి పోటీ చేయాలని మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయం అతిపెద్ద పొరపాటు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఒకవేళ దీదీ ఓడిపోతే టీఎంసీ ఓ పార్టీగా కలిసి పనిచేయడం చాలా కష్టమని చెప్పారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోదీ పాల్గొన్నారు.
"మమతా దీదీని ఇంకో స్థానం నుంచి పోటీ చేయించాలని టీఎంసీలో కొందరు భావించారు. అలా చేస్తే అది ఆమె చేసిన రెండో పెద్ద పొరపాటు అవుతుందని ఇంకొంత మంది తెలివైనవారు సూచించారు. రెండు సీట్లలో ఓడిపోతే.. టీఎంసీ ఓ పార్టీగా పనిచేయడం కష్టతరమవుతుందని చెప్పారు."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ఎన్నికల నిర్వహణపై ఈసీని మమత విమర్శించడాన్ని ఖండించారు మోదీ. తప్పుడు ఓట్లు రాకపోవడం వల్లే దీదీ విమర్శలు చేస్తున్నారని అన్నారు. 'పదేళ్ల క్రితం ఈ భద్రతా దళాలు, ఎన్నికల కమిషన్‌పై దీదీ అపార నమ్మకం ఉంచేవారు. ఇప్పుడు వాటిపైనే విమర్శలు చేస్తున్నారు. పదేళ్లు అధికారంలో ఉండటానికి ఇదే ఈవీఎంలు, ఏజెన్సీలు మీకు సహకరించినప్పుడు ఇవి మంచిగా కనిపించాయి' అని మోదీ వ్యాఖ్యానించారు.
'నేతాజీ భావనకు విరుద్ధం'
భాజపా నేతలను బయటివారిగా పేర్కొనడం.. నేతాజీ సంఘటిత భావజాలానికి, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని అన్నారు. భాజపా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గడ్డమీద పుట్టిన బిడ్డే సీఎం పదవి చేపడతారని చెప్పారు. టీఎంసీని డబ్బులు లూటీ చేసే సంస్థగా అభివర్ణించారు.
"టీఎంసీ గూండాలను అదుపులో పెట్టుకోండి. మోదీ వచ్చారని వారికి వివరించి చెప్పండి. వారి దౌర్జన్యాన్ని ఇక సహించేది లేదు. బంగాల్‌కు హింస, భయోత్పాతాలు అవసరం లేదు. ఇక్కడి యువతకు విద్య కావాలి. మహిళలకు రక్షణ కావాలి. ఇక్కడి తల్లులకు న్యాయం, గౌరవం కావాలి."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేయాలని టీఎంసీ వర్గాలు భావిస్తున్నాయని మోదీ చెప్పారు. దీనర్థం బంగాల్లో ఓడిపోతామని దీదీ ఒప్పుకున్నట్లేనని అన్నారు. బంగాల్ బయటి ప్రాంతాల కోసం దీదీ వెతుక్కుంటున్నారని చెప్పారు. బంగాల్ మాదిరిగానే వారణాసి, ఉత్తర్‌ప్రదేశ్ ప్రజల మనసులు విశాలమైనవని.. దీదీ అక్కడికి వెళ్లినా.. ఆమెను బయటి వ్యక్తిగా పరిగణించరని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: 'బంగాల్ ప్రజలను కించపరుస్తున్న దీదీ'