constable who killed in wife at Vanasthalipuram : హైదరాబాద్‌లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌతమినగర్‌లో దారుణం చోటుచేసుకొంది. కట్టుకున్న భార్యను అత్యంత దారుణంగా ఓ కానిస్టేబుల్ హతమార్చాడు. మొదట కత్తితో తన భార్య గొంతుకోసి.. కసితీర.. భవనం మొదటి అంతస్తుపైకి లాక్కెళ్లి అక్కడి నుంచి కిందకు నెట్టేశాడు. గొంతుకోసిన తర్వాత కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడిన ఆ మహిళ.. భవనంపై నుంచి కిందపడి పూర్తిగా ప్రాణాలు కోల్పోయింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురంలో నివాసం ఉంటున్న పోలీసు కానిస్టేబుల్ రాజ్ కుమార్‌కు తన భార్య శోభతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. వివాహేతర సంబంధం ఈ దంపతుల మధ్య చిచ్చుపెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే భార్యపై పగ పెంచుకున్న రాజ్‌కుమార్.. గత రాత్రి గొడవకు దిగి భార్య ఫోన్‌ను ధ్వంసం చేశాడు. అనంతరం ఇవాళ ఉదయం ఈ విషయంపైనే మరోసారి గొడవపడ్డారు. ఈ క్రమంలో క్షణికావేశంలో భార్య శోభపై దాడికి తెగబడ్డాడు. అడ్డుకోబోయిన కుమారుడ్ని సైతం పక్కకు నెట్టగా.. ఆ అబ్బాయి చేతులకు గాయాలయ్యాయి. అనంతరం శోభ గొంతును కత్తితో కోసేశాడు.
ఆమె తప్పించుకొనే ప్రయత్నం చేయగా.. వెంబడించి మరీ భవనంపై నుంచి కిందకు నెట్టేశాడు. ఈ ఘటనలో శోభ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఒక్కసారిగా గట్టిగా శబ్ధం వినిపించడంతో ఇరుగుపొరుగు వచ్చి చూశారు. అక్కడ శోభ నిర్జీవంగా రక్తపు మడుగులో పడి ఉండటం చూసి షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ ఈ ఘటనపై వివరాలు ఆరా తీశారు. ఆమెను భర్తే హత్య చేశాడని స్థానికులు పోలీసులతో చెప్పినట్లు సమాచారం.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని స్థానికులను ఆరా తీస్తున్నారు. హత్యకు పాల్పడిన రాజ్‌కుమార్ హైకోర్టు 4వ గేటు వద్ద విధులు నిర్వహించేవాడని పోలీసులు తెలుసుకున్నారు. రాజ్‌కుమార్ స్వస్థలం నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం యాదగిరి పల్లి గ్రామంగా పోలీసులు గుర్తించారు. అయితే భార్యను హత్య చేసిన తర్వాత రాజ్ కుమార్ ఎక్కడికి వెళ్లాడనే విషయం తెలియలేదు. పరారీలో ఉన్నాడా లేక పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే విషయాల గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఇవీ చదవండి: