200,000 యాంఫోటెరిసిన్ బీ ఇంజెక్షన్లు భారత్‌కు ఆదివారం చేరుకున్నాయని అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధూ వెల్లడించారు. ఈ మేరకు ట్విట్టర్లో పేర్కొన్నారు. మ్యుకర్‌మైకోసిస్ (బ్లాక్ ఫంగస్- Black fungus) వ్యాధి చికిత్సలో యాంఫోటెరిసిన్ బీ మందు వాడుతారు.
కొవిడ్-19 నుంచి కోలుకున్నవారిలో మ్యుకర్‌మైకోసిస్ (బ్లాక్ ఫంగస్-Black fungus) సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహం ఉన్న వారు దీని బారిన పడతారు. వివిధ అనారోగ్య సమస్యలతో మందులు వాడుతున్న వారిలో పర్యావరణంలో ఉన్న సూక్ష్మక్రిములతో పోరాడే శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి వారిలో మ్యుకర్‌మైకోసిస్ ప్రబలడానికి అవకాశం ఉంటుంది. ఇది తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుందని పేర్కొంది.
ఈ ఇన్‌ఫెక్షన్ సోకినవారిలో కళ్లు, ముక్కు చుట్టూ ఎర్రబారడం, నొప్పి తలెత్తడం, జ్వరం, తలనొప్పి, దగ్గు, ఊపిరి అందకపోవడం, రక్తవాంతులు, మతిస్థిమితంలో మార్పులు వంటివి తలెత్తుతాయని తెలిపింది. స్టైరాయిడ్లు ఎక్కువగా వాడే వారికి బ్లాక్ ఫంగస్(Black fungus) సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్టైరాయిడ్లను వైద్యుల సూచన మేరకే తీసుకోవాలి.
ఇదీ చదవండి: బ్లాక్ ఫంగస్: లక్షణాలు.. నిర్ధరణ.. చికిత్స ఏంటంటే?