వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న గోవాలో కాంగ్రెస్ తరఫున ప్రచారాన్ని (Rahul Gandhi Goa) ప్రారంభించారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. కాంగ్రెస్ ప్రకటించే ఎన్నికల మేనిఫెస్టో కేవలం వాగ్దానం కాదని, అది ప్రజలకు ఇచ్చిన అభయం అని (Rahul Gandhi news) పేర్కొన్నారు. వాటిని తప్పక నెరవేరుస్తామని స్పష్టం చేశారు.
దక్షిణ గోవాలో మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగించిన రాహుల్ (Rahul Gandhi Goa).. నైరుతి రైల్వే చేపట్టిన డబుల్ ట్రాకింగ్ ప్రాజెక్టును వ్యతిరేకించారు. రాష్ట్రాన్ని బొగ్గు హబ్‌గా మార్చేందుకే ఈ ప్రాజెక్టు చేపట్టారని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ.. రాహుల్ తాజాగా స్పందించారు.
"మీ సమయాన్ని వృథా చేయడానికి నేనిక్కడికి రాలేదు. ఒక్కటే స్పష్టంగా చెబుతా. కాంగ్రెస్ మేనిఫెస్టో కేవలం వాగ్దానం కాదు. నేను ఇతర నేతల్లా కాదు. నా విశ్వసనీయత నాకు ముఖ్యం. నేనేదైనా చెప్పానంటే అది జరిగేలా చూస్తా. బొగ్గు హబ్‌లను అనుమతించనని హామీ ఇచ్చి.. ఆ పనిని నెరవేర్చకపోతే.. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు నాకు విశ్వసనీయత ఉండదు. పంజాబ్, కర్ణాటకలో మేం ఇదే చేశాం. ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నాం."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
'భాజపా ద్వేషాన్ని ప్రేమతో జయిస్తాం'
భాజపాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ రాహుల్ (Rahul Gandhi vs BJP) .. విద్వేషపూరిత పోకడలతో భాజపా ప్రజలను విడగొడుతోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మాత్రం ప్రేమ, ఆప్యాయాలతో ప్రజలను ముందుకు తీసుకెళ్తోందని అన్నారు.
"భాజపా, కాంగ్రెస్ మధ్య వ్యత్యాసం ఏంటో నేను ఇప్పుడు స్పష్టంగా చెప్పదలచుకున్నా. భారత ప్రజలను ఐక్యం చేయడాన్ని కాంగ్రెస్ విశ్వసిస్తుంది. వారిని ముందుకు తీసుకెళ్లడంపై దృష్టిసారిస్తుంది. భాజపా వ్యాప్తి చేసే విద్వేషానికి కాంగ్రెస్ ప్రేమ, ఆప్యాయతలతోనే సమాధానం ఇస్తుంది. ఎక్కడైతే కోపం, ద్వేషం, విభజనవాదం వ్యాప్తి అవుతుందో.. అక్కడ ప్రేమ ఆప్యాయతలను మేం పంచుతాం."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
గోవా పర్యటనలో భాగంగా పార్టీ కార్యకర్తల కన్వెన్షన్‌లో పాల్గొననున్నారు రాహుల్ గాంధీ. మైనింగ్ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులను కలవనున్నారు.
ఇదీ చదవండి: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కే మా మద్దతు - లాలూ ప్రసాద్