Congress New Year Resolution For Pm: కొత్త సంవత్సరంలో దేశంలోని 130 కోట్ల మంది ప్రజల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్రమోదీ పనిచేయాలే గానీ కొందరి కోసమే కాదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. పీఆర్ (ప్రజా సంబంధాలు)పై కాదు.. ప్రజలమీద దృష్టి పెట్టండని సూచించింది. ప్రధాని, కేంద్ర మంత్రులు 2022 సంవత్సరంలో చేయాల్సిన సంకల్పాలపై ట్విటర్లో పలు సూచనలు చేసింది. ఒకరిద్దరి కంటే 130 కోట్ల మంది ప్రజలు ఎక్కువనే విషయాన్ని ప్రధాని గ్రహించాలని సూచించింది.
Congress Criticises BJP: ఎన్నికలు, నేరగాళ్లు, సొంత పార్టీ.. ఇవి కాకుండా దేశం పట్ల నిర్వహించాల్సిన విధులే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు మిన్నగా ఉండాలని పేర్కొంది. 'పౌరుల్ని రక్షించండి.. నేరగాళ్లను కాదు..' అని సూచించింది. నీతి, న్యాయం, ప్రజల హక్కుల పరిరక్షణకు అవసరమైనదంతా చేయాలనేది తమ పార్టీ నేత రాహుల్‌గాంధీ జీవితకాల సంకల్పమని వెల్లడించింది. అన్నదాతలపై దాడులు చేయకుండా వారిని ఆదుకోవడాన్ని సంకల్పంగా తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తోమర్‌కు తెలిపింది.
ప్రభుత్వ వైఫల్యాలకు "దైవిక చర్యల్ని" జవాబుదారీగా చేయవద్దని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కాంగ్రెస్ సూచించింది. చైనాపై కన్నెర్ర చేయడంలో ప్రధాని వైఫల్యం చెందారనీ, పొరుగుదేశ చొరబాట్లపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అయినా వాస్తవాలు చెప్పేలా సంకల్పించాలని తెలిపింది. మొదటి రెండు విడతల మాదిరిగా కాకుండా కరోనా మూడో ఉద్ధృతినైనా సమర్థంగా ఎదుర్కోవడమనేది ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు సంకల్పం కావాలని పేర్కొంది.
ఇదీ చదవండి: పాఠశాలలో ఆరెస్సెస్ కార్యక్రమం.. వామపక్ష సంఘాలు ఫైర్