Congress Working Committee Meeting In New Delhi : దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కుల గణన, త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు అక్టోబరు 9న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) దిల్లీలో సమావేశం కానుంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, తెలంగాణలో బీఆర్ఎస్, మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్) నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అలాగే ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశానికి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘెల్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సైతం హాజరుకానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ప్రతిపక్ష నాయకులపై కేంద్ర సంస్థలు దాడులు జరుపుతున్న సమయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ నాయకుడు, ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్‌పై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు సంస్థల నుంచి దాడులు ఎదుర్కొంటున్న విపక్ష నాయకులకు అండగా ఉండడంపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.
సీడబ్ల్యూసీని పునర్వ్యవస్థీకరించిన తర్వాత సెప్టెంబరు 16న హైదరాబాద్‌లో తొలి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం శాసనసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి సారించింది. మొదటి సమావేశం జరిగిన కేవలం 3వారాల తర్వాత దిల్లీలో మళ్లీ సీడబ్ల్యూసీ భేటీ కానుంది. హైదరాబాద్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు, చర్చలకు సంబంధించిన అంశాలను సమీక్షించే అవకాశం ఉంది.
Congress Working Committee Reconstituted : ఈ ఏడాది ఆగస్టు 20న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని పునర్వ్యవస్థీకరించారు. మొత్తంగా 84 మందితో విడుదల చేసిన జాబితాలో 39మందిని సీడబ్ల్యూసీ జనరల్ సభ్యులుగా.. 18 మందిని సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితులుగా, 14 మందిని ఇంఛార్జ్‌లుగా, తొమ్మిది మందిని ప్రత్యేక ఆహ్వానితులు, నలుగురిని ఎక్స్‌అఫిషియో సభ్యులుగా పేర్కొన్నారు. పార్టీలో అసమ్మతి వర్గంగా పేరొందిన జీ23 నాయకులైన శశిథరూర్, ఆనంద్ శర్మ, ముకుల్ వాస్నిక్ వంటి నేతలకు ఈ కమిటీలో చోటు కల్పించారు. అలాగే.. సచిన్ పైలట్‌తో పాటు దీపా దాస్ మున్షి, సయ్యద్ నసీర్ హుస్సేన్‌ను కొత్తగా సీడబ్ల్యూసీలోకి తీసుకున్నారు.