గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్ర చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ యాత్ర కేరళలోని కొల్లాంలో సాగుతోంది. అయితే భారత్ జోడో యాత్రకు నిధులివ్వాలని కాంగ్రెస్ కార్యకర్తలు ఓ కూరగాయల వ్యాపారిపై దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ ఘటన రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగిందంటే.. కొల్లాంలోని ఫవాజ్ అనే వ్యాపారిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్రకు విరాళమివ్వమని అడిగారు కాంగ్రెస్ కార్యకర్తలు. అయితే ఫవాజ్ రూ.500 ఇస్తానన్నాడు. రూ.2000 ఇవ్వాలని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. అంత ఎక్కువ డబ్బులు ఇవ్వలేనని ఫవాజ్ చెప్పడం వల్ల అతడిపై దాడికి దిగారు. దుకాణంలోని తూకం యంత్రాల్ని విసిరేశారు. అక్కడి సిబ్బందిపైనా దాడికి పాల్పడ్డారు.
కాంగ్రెస్ కార్యకర్తల బృందం.. దుకాణానికి వచ్చి భారత్ జోడో యాత్ర కోసం విరాళాలు అడిగారు. నేను రూ.500 ఇచ్చాను.. కానీ వారు రూ. 2,000 డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేను అని చెప్పడం వల్ల దాడికి పాల్పడ్డారు. తూకం యంత్రాలను విసిరేశారు. దుర్భాషలాడుతూ దుకాణ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు.
--ఫవాజ్, కూరగాయల దుకాణం యజమాని
ఫవాజ్.. కున్నికోడ్ పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ కార్యకర్తలపై ఫిర్యాదు చేశాడు. ఈ విషయం కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకరన్ దృష్టికి చేరింది. దీంతో ఆయన వ్యాపారిపై దాడికి పాల్పడిన ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
అనేక సమస్యలతో సతమవుతున్న కాంగ్రెస్‌ను గాడినపెట్టి 2024 సార్వత్రిక ఎన్నికలకు పార్టీని సిద్ధచేయడమే లక్ష్యంగా.. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సుమారు 3,570 కి.మీ మేర ఈ జోడో యాత్ర సాగనుంది. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా 148 రోజుల పాటు రాహుల్ నేతృత్వంలో నేతలు ముందుకు వెళ్తారు. రోజూ రెండు విడతల్లో.. ఉదయం 7 గంటల నుంచి 10.30 గంటల వరకు, మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఈ పాదయాత్ర జరగనుంది.
ఇవీ చదవండి: యువకుడ్ని వెంటాడుతున్న పాము.. 10 రోజుల్లో 5 కాట్లు.. ప్రతిసారీ అక్కడే...
సగం షేవింగ్ చేశాక డబ్బులు డిమాండ్.. గొడవ ముదిరి రెండు హత్యలు, ఆస్తులు ధ్వంసం