Congress Strategy For UP Election : దిల్లీ గద్దె నెగ్గాలంటే ఉత్తర్‌ప్రదేశ్ దగ్గరిదారిగా రాజకీయపార్టీలు భావిస్తాయి. ఆరాష్ట్రంలో ఎక్కువ స్థానాలు సాధిస్తే.. హస్తిన పీఠం దక్కుతుందని విశ్వసిస్తాయి. అందుకే యూపీ లక్ష్యంగా జాతీయ పార్టీలు సార్వత్రిక ఎన్నికల వ్యూహాలు అమలు చేస్తాయి. లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు విపక్షాలతో కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. పెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. పార్టీకి చెందిన ప్రముఖ నేతలను వీలైనంతవరకు ఎక్కువగా యూపీ నుంచే బరిలో దింపాలని.. ఆ పార్టీ అధినాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది.
అక్కడి నుంచే ఖర్గే పోటీ!
Congress Plans For UP : ఒకప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్.. తిరిగి పూర్వవైభవం సాధించేందుకు మేథోమధనం చేస్తోంది. పదేళ్ల మోదీ సర్కార్‌పై ప్రజా వ్యతిరేకత, క్రమక్రమంగా బీఎస్పీ ప్రాభవం తగ్గటం వంటివి కలిసొచ్చే అంశాలుగా భావిస్తోంది. దళిత ఓటు బ్యాంకును తిరిగి దక్కించుకునేందుకు.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రిజర్వ్‌డ్ స్థానం నుంచి పోటీ చేయించే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
బీఎస్పీ స్థానాన్ని భర్తీ చేసే అవకాశాలు కాంగ్రెస్‌కే!
Congress Uttar Pradesh : ఉత్తర్‌ప్రదేశ్‌లో బలమైన రాజకీయ శక్తిగా కొనసాగిన బహుజన సమాజ్ పార్టీ ప్రాభవం కొంత తగ్గినట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ అధినేత్రి మాయావతి ఛరిష్మా, దళితులు ముఖ్యంగా జాతవ్‌లపై పట్టు సడలినట్లు హస్తం నేతలు అంచనా వేస్తున్నారు. అందువల్ల బీఎస్పీ స్థానాన్ని భర్తీ చేసే అవకాశాలు తమ పార్టీకే ఉంటాయని హస్తం నేతలు లెక్కలు వేస్తున్నారు. ఆ కారణంతోనే పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను.. ఇటావా లేదా బారాబంకీ నుంచి బరిలో దింపాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
యూపీ, కర్ణాటకలో ఖర్గే పోటీ!
Congress Session In Uttar Pradesh : ఒకవేళ ఖర్గే పోటీ చేస్తే సమీప నియోజకవర్గాల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులకు కూడా ప్రయోజనం ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్, ఎస్పీ.. రెండు పార్టీలు ఇండియా కూటమిలోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఖర్గే యూపీతోపాటు చాలాకాలం నుంచి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కర్ణాటక నుంచి కూడా పోటీ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రాహుల్, ప్రియాంక అక్కడి నుంచే పోటీ!
Can Rahul Gandhi Contest Election In 2024 : కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఆ పార్టీ సంప్రదాయ సీటు అమేథీ నుంచి, ఆయన సోదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. ప్రయాగ్‌రాజ్ లేదా పూల్‌పుర్ లేదా వారణాసి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆరోగ్య కారణాలతో సోనియాగాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీకి దూరంగా ఉంటే ఆ స్థానాన్ని ప్రియాంకతో భర్తీచేసే సూచనలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
దళిత ఓటు బ్యాంక్ లక్ష్యంగా..
Congress Party Dalit Vote Bank : దళిత ఓటు బ్యాంకును లక్ష్యం చేసుకొనే కాంగ్రెస్ పార్టీ ఖర్గేను యూపీ నుంచి బరిలో దింపాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ బీఎస్పీ ఇండియా కూటమిలో చేరినా కూడా ఈ నిర్ణయంలో మార్పు ఉండే అవకాశం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు యూపీ కాంగ్రెస్ విభాగం కూడా ఇండియా కూటమిలో బీఎస్పీ చేరాలని కోరుతోంది. ప్రజల విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎన్డీయే అభ్యర్థులపై ప్రతిపక్షాల తరఫున ఒకే అభ్యర్థి ఉండాలని యూపీ కాంగ్రెస్ విభాగం అధ్యక్షుడు అజయ్‌రాయ్ అభిప్రాయపడ్డారు. ప్రజల భావోద్వేగాలను దృష్టిలో ఉంచుకొని ప్రతిపక్ష ఇండియా కూటమిలో చేరాలని బీఎస్పీని ఆయన ఆహ్వానించారు. ఇతర నాయకులు కూడా ఆయన వ్యాఖ్యలు తప్పుకాదని సమర్థించారు.
'ఖర్గే' అస్త్రాన్ని..
Congress Plans For UP Mallikarjuna Kharge : ఇటీవల జరిగిన ఘోసీ ఉప ఎన్నికకు బీఎస్పీ దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఓటు వేస్తే నోటాకు వేయాలని, లేకుంటే ఇంట్లోనే ఉండాలని పిలుపునిచ్చింది. అయితే ఆ ఉపఎన్నికలో నోటాకు కేవలం 1700 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అంటే యూపీలో బీఎస్పీ ముఖ్యంగా దళితుల్లో పట్టు కోల్పోయిందని చెప్పటానికి ఘోసీ ఉప ఎన్నిక ఫలితమే నిదర్శనమని కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో దళిత ఓటు బ్యాంకు లక్ష్యంగా.. ఖర్గే అస్త్రాన్ని ప్రయోగించేందుకు హస్తం పార్టీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.