Punjab polls: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో పోటీలో నిలిచే తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి పార్టీలు. ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేసిన కాంగ్రెస్.. తాజాగా 8 మంది అభ్యర్థులతో మూడో జాబితాను ప్రకటించింది. అందులో ముఖ్యమంత్రి చరణ్ జీత్ చన్నీకి చోటు కల్పించింది.
ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ రెండు స్థానాల నుంచి బరిలో నిలుస్తున్నారు. భదౌర్, ఛంకౌర్ సాహిబ్ నియోజకవర్గాల్లో సీఎం పోటీ చేస్తారని పార్టీ స్పష్టం చేసింది.
కెప్టెన్‌పై పోటీకి మాజీ మేయర్
కాంగ్రెస్ పార్టీని వదిలి వేరు కుంపటి పెట్టిన మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై పోటీకి.. కీలక నేత, పటియాలా మాజీ మేయర్ విష్ణు శర్మను బరిలో దింపుతోంది హస్తం పార్టీ. అమరీందర్ పోటీ చేస్తున్న పటియాలా అసెంబ్లీ స్థానాన్ని విష్ణు శర్మకు కేటాయించింది. గతంలో కెప్టెన్‌కు శర్మ సన్నిహితుడిగా ఉండటం గమనార్హం.
మరోవైపు.. శిరోమణి అకాలీ దళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై జలాబాద్ నియోజకవర్గంలో మోహన్ సింగ్ ఫలియన్వాలాను పోటీలో నిలుపుతోంది హస్తం పార్టీ. అలాగే.. బర్నాలా అసెంబ్లీ స్థానం నుంచి కేంద్ర మాజీ మంత్రి పవన్ కుమార్ బన్సాల్ కుమారడు మనీశ్ బన్సాల్‌ను బరిలో దింపుతోంది.
రాష్ట్రంలో అత్యధిక స్థానాలు సాధించి తమ అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. ఆమ్ ఆద్మీ పార్టీ, ఎస్ఏడీ-బీఎస్పీ, భాజపా-పీఎల్సీ-ఎస్ఏడీ(ఎస్) కూటములను ఢీకొట్టనుంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 20న జరగనున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉండనుంది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: 'పంజాబ్ సీఎం అభ్యర్థిని నిర్ణయించేది కార్యకర్తలే'