బంగాల్, అసోం శాసనసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. అసోంలో 40 స్ధానాలకు, బంగాల్‌లో 13 స్ధానాలకు అభ్యర్ధులను ప్రకటించింది. అసోం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రిపున్ బోరా.. గోహ్‌పూర్ స్ధానం నుంచి పోటీ చేయనున్నారు. అసోంలో కాంగ్రెస్, వామపక్షాలు, పలు బోడోలాండ్ పార్టీలతో కలిసి పోటీ చేస్తోంది.
అసోంలో 2001నుంచి 2016 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది. 126 స్థానాలకు గానూ 26 సీట్లకు పరిమితమైంది. ఈసారి వామపక్షాలు, బోడోలాండ్ పార్టీలతో కలిసి మహా కూటమిగా బరిలోకి దిగుతోంది. అసోంలో మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
అటు బంగాల్‌లో వామపక్షాలతో కలిసి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ 13 స్ధానాలకు అభ్యర్ధులను ప్రకటించింది. బంగాల్‌లో 294 స్ధానాలు ఉండగా, పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి 92 సీట్లు దక్కాయి.