లోక్‌సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ధరల పెరుగుదల అంశంపై లోక్‌సభ కార్యకలాపాలకు ఆటంకం కలిగించినందుకు కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. స్పీకర్ హెచ్చరించినా అనుచిత ప్రవర్తనతో సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్న వారిని.. వర్షాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయాలని లోక్‌సభ తీర్మానించింది. ఈ మేరకు మాణిక్కం ఠాకూర్, టీఎన్ ప్రతాపన్, జ్యోతిమణి, రమ్య హరిదాస్‌ను స్పీకర్ సస్పెండ్ చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి.. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ మూజువాణీ ఓటుతో ఆమోదం తెలిపింది. నలుగురు సభ్యులను సస్పెండ్ చేసినప్పటికీ విపక్షాలు నిరసనలు కొనసాగించడం వల్ల లోక్‌సభ రేపటికి వాయిదా పడింది.
ప్రజా సమస్యలు లేవనెత్తినందుకే: నలుగురు ఎంపీల సస్పెన్షన్‌పై కాంగ్రెస్ స్పందించింది. తమ ఎంపీలు ప్రజా సమస్యలను లేవనెత్తున్నారని.. అందుకే సస్పెండ్ చేసి తమను భయపెట్టాలని ప్రభుత్వం భావిస్తోందని విమర్శించారు.
మరోవైపు రాజ్యసభలోనూ వాయిదాల పర్వమే కొనసాగింది. రాజ్యసభ ప్రారంభమయ్యాక మొదట 3 గంటలకు వాయిదా వేశారు ఛైర్మన్. అనంతరం తిరిగి ప్రారంభమైనా.. ఆందోళనలు తగ్గకపోవడం వల్ల మరోసారి 4 గంటలకు వాయిదా వేశారు. ధర పెరుగుదల అంశంపై చర్చ చేపట్టాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. కాంగ్రెస్, టీఎంసీ సభ్యులు వెల్లోపలికి వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీటిపై స్పందించిన రాజ్యసభ నాయకుడు పీయూశ్ గోయల్.. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ప్రస్తుతం కొవిడ్ సోకిందని.. మంత్రి వచ్చాక ఈ అంశంపై చర్చిద్దామని తెలిపారు. ప్రతిపక్షాలకు చర్చ చేపట్టే ఉద్దేశం లేదని.. అందుకే సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తోందన్నారు.
వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి వాయిదా పడుతూనే ఉంది. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం దృష్ట్యా.. సోమవారం మధ్యాహ్నాం రెండు గంటలకు రాజ్యసభ సమావేశమైంది. మొదట ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం గెలిచిన నీరజ్ చోప్రాను సభ అభినందించింది. అనంతరం రాజ్యసభకు నామినేట్ అయిన ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ప్రమాణం చేశారు.
ఇవీ చదవండి: ముర్ముకు అభినందనల వెల్లువ.. చైనా అధ్యక్షుడి కీలక సందేశం!
పువ్వుల కోసం వెళ్లి బావిలో శవంగా తేలిన బాలిక.. కుక్కలే కారణం!