ప్రధాని నరేంద్ర మోదీ, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మధ్య అసలు సంబంధమేంటని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అదానీ వ్యవహారంలో మోదీ భయపడుతున్నారని ఆయన ఆరోపించారు. తాను లోక్‌సభలో మాట్లాడేందుకు స్పీకర్ అనుమతి కోరినా.. అవకాశం ఇస్తారన్న నమ్మకం లేదని రాహుల్ అన్నారు. ఈ మేరకు గురువారం దిల్లీలో మీడియా సమావేశంలో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.
ఈరోజు(గురువారం) ఉదయం పార్లమెంట్‌కు వెళ్లి లోక్‌సభ స్పీకర్‌ను కలిశాను. సభలో మాట్లాడేందుకు అనుమతించాలని కోరాను. కేంద్ర క్యాబినెట్‌లోని నలుగురు మంత్రులు నాపై ఆరోపణలు చేశారు. కాబట్టి నా అభిప్రాయాన్ని కూడా సభలో తెలిపే హక్కు నాకు ఉంది. ఎంపీగా పార్లమెంటులో సమాధానం చెప్పడం నా ముందున్న బాధ్యత. ఆ తర్వాతే మీడియా ముందు వివరణ ఇవ్వగలను. శుక్రవారం.. పార్లమెంట్లో మాట్లాడేందుకు అనుమతిస్తారని ఆశిస్తున్నాను. కానీ మరోవైపు, నాకు అవకాశం ఇస్తారన్న నమ్మకం లేదు. భారత్‌లో ప్రజాస్వామ్యం అమల్లో ఉంటేనే నేను మాట్లాడగలను. కొన్ని రోజుల క్రితం.. నేను మోదీ, అదానీని ప్రశ్నిస్తూ సభలో ప్రసంగించాను. ఆ ప్రశ్నలకు మోదీ ఇంకా సమాధానం ఇవ్వలేదు. అసలు మోదీ, అదానీకి ఉన్న సంబంధంమేంటనేది నా తొలి ప్రశ్న. అదానీ వ్యవహారంలో మోదీతోపాటు కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది."
-- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
'అలా మాట్లాడటం రాహుల్‌కు అలవాటే?'
బ్రిటన్ పర్యటనలో రాహల్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్లో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. విదేశాల్లో భారత ప్రజాస్వామ్యాన్ని విమర్శించడం ద్వారా భారతీయుల మనోభావాలను కించపరచడం ఆయనకు అలవాటేనని ఆ పార్టీ ఎంపీ రవి శంకర్ ప్రసాద్ ఆరోపించారు. 'అమెరికా, యూరప్ జోక్యం' అనే వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు రాహుల్ ఒక్కసారి కూడా చెప్పలేదని ఆయన అన్నారు. ఇంకెంత కాలం దేశాన్ని తప్పుదోవ పట్టిస్తారని ప్రశ్నించారు. భారత విదేశాంగ విధానంపై రాహుల్‌కు అవగాహన లేదని రవి శంకర్ ప్రసాద్ విమర్శించారు.
అంతకుముందు.. రాహుల్ తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేయాలని కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ప్రహ్లద్ జోషీ డిమాండ్ చేశారు. కేవలం పార్లమెంట్‌నే కాదు.. మొత్తం దేశాన్ని దారుణంగా అవమానిస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీలే కాదు.. దేశమంతా తీవ్ర ఆగ్రహంతో ఉందన్నారు.
పార్లమెంట్ ఎదుట ప్రతిపక్ష ఎంపీల మానవహారం..
అంతకుముందు.. అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) వేయాలంటూ ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటు ఎదుట మానవహారంగా ఏర్పడి ఆందోళన నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపారు. ప్రభుత్వం కావాలనే సభను జరగకుండా అడ్డుకుంటోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేశారు. అదానీ అంశం, ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యలపై చర్చ జరగకుండా అధికారపక్షం అడ్డుకుంటోందని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.
"మా డిమాండ్ ఒకటే. పార్లమెంటులో అదానీ అంశంపై చర్చ జరగాలి. జేపీసీ వేయాలి. జేపీసీలో ఏం నిజం బయటపడుతుందో.. దాన్ని అందరూ అంగీకరిస్తారు. అందుకే మేము జేపీసీ వేయాలని కోరుతున్నాం. ఇందుకోసం మేము బుధవారం ఆందోళన చేశాం. ఈరోజు(గురువారం) కూడా చేశాం. గత సమావేశాల సమయంలోనూ డిమాండ్ చేశాం. కానీ దానికి ప్రభుత్వం సిద్ధంగాలేదు. సభను మూసివేయాలని ప్రభుత్వం చూస్తోంది. సభ ప్రారంభమైన వెంటనే మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు, భాజపా ఎంపీలు నిలబడి హంగామా చేస్తున్నారు. దీని అర్థం ఏమిటంటే.. పార్లమెంటరీ ప్రజస్వామ్య ప్రక్రియను ఖూనీ చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు"
- మల్లికార్జున ఖర్గే, రాజ్యసభలో ప్రతిపక్ష నేత
అంతకుముందు ఉభయ సభల్లో తమ వ్యూహాన్ని సమన్వయం చేసుకునేందుకు పలు ప్రతిపక్ష పార్టీల నేతలు గురువారం రాజ్యసభలోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్‌లో సమావేశమయ్యారు. కాంగ్రెస్, డీఎంకే, ఎన్‌సీపీ, ఎస్‌పీ, ఆర్‌జేడీ, బీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ, జేడీయూ, జేఎంఎం, ఎండీఎంకే, ఆప్ పార్టీల నాయకులు ఆ సమావేశానికి హాజరయ్యారు.
'పర్మిషన్ ఇస్తే నేనేం ఆలోచిస్తున్నానో చెబుతా..'
బ్రిటన్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలంటూ భాజపా డిమాండ్ చేస్తున్న వేళ.. రాహుల్‌గాంధీ గురువారం పార్లమెంటు వచ్చారు. ఈ సందర్భంగా అధికార పార్టీ డిమాండ్‌పై ఏమంటారో చెప్పాలని విలేకరులు.. రాహుల్‌ను ప్రశ్నించారు. సభలో మాట్లాడేందుకు అనుమతి ఇస్తే తాను ఏమి ఆలోచిస్తున్నానో చెబుతానని ఆయన చెప్పారు. అయితే రాహుల్.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. లోక్‌సభలో మాట్లాడేందుకు అనుమతించాలని కోరారు. ఆ సమయంలో రాహుల్‌తోపాటు ఆ పార్టీ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి ఉన్నారు.
'రాహుల్ నోట.. భారత వ్యతిరేక శక్తుల భాష'
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత వ్యతిరేక శక్తుల భాషలో మాట్లాడుతున్నారని, భారతదేశాన్ని అపఖ్యాతి పాలు చేసేందుకు కుట్ర పన్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. లండన్‌లో భారత్ గురించి రాహుల్ అబద్ధాలు చెప్పారని విమర్శించారు. తోటి పార్లమెంట్ సభ్యుడి చర్యను ఖండించకపోతే ప్రజలు ప్రశ్నిస్తారని, లండన్‌లో చేసిన వ్యాఖ్యలకు సభలో క్షమాపణలకు డిమాండ్ చేస్తామని ఆయన మీడియాతో అన్నారు.
"రాహుల్ గాంధీ మాట్లాడే భాష భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసేవారు, భారతదేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నిన వారు మాట్లాడే భాష. ఆయన పార్లమెంటులో క్షమాపణ చెప్పాలి. ఆయన క్షమాపణ చెప్పాలని అడగడం మా కర్తవ్యం. యూనివర్శిటీ ప్రసంగంలో.. తనను మాట్లాడనివ్వడం లేదని రాహుల్ అన్నారు. అది పూర్తిగా అవాస్తవం. దేశవ్యాప్తంగా ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్రలో పగలు, రాత్రి తేడా లేకుండా పలుమార్లు ప్రసంగించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దేశంలో ఎక్కువ మాట్లాడే వ్యక్తి రాహుల్ గాంధీనే" అని కిరణ్ రిజిజు విమర్శలు గుప్పించారు.
శుక్రవారానికి ఉభయ సభలు వాయిదా
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్యుద్ధం కొనసాగడం వల్ల ఉభయసభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. రాజ్యసభ సమావేశం కాగానే తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ నినాదాలు చేశారు. నల్లటి మాస్కులు ధరించి నిరసన తెలిపారు. ఇతర ప్రతిపక్ష సభ్యులు కూడా నినాదాలు చేయడం వల్ల పెద్దలసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. తిరిగి 2 గంటలకు సమావేశమైన సభలో రాహుల్ అంశం ప్రస్తావనకు రావడం వల్ల సభ శుక్రవారానికి వాయిదా పడింది. రాహుల్ గాంధీ యూకేలో చేసిన వాఖ్యలపై అధికార పక్షం అభ్యంతరాలతో లోక్‌సభలో కూడా శుక్రవారానికి వాయిదా పడింది.